గుజరాత్‌లో మరో మూక దాడి..

అక్రమంగా గోవులను వేరే చోటుకు తరలిస్తున్నట్టు ఒప్పుకోవాలని కొంతమంది మూక సయ్యద్‌ని బెదిరించారు.

news18-telugu
Updated: August 23, 2018, 4:36 PM IST
గుజరాత్‌లో మరో మూక దాడి..
మూకదాడిలో గాయపడ్డ బాధితుడు సయ్యద్..
  • Share this:
మూక దాడులపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ.. ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా గుజరాత్‌లో మరో మూక దాడి చోటు చేసుకుంది. గోవులను అక్రమంగా తరలిస్తున్నాడన్నకారణంతో కొంతమంది మూక ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయపడ్డ వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని మెహ్‌సానా జిల్లా అలంపూర్ గ్రామానికి చెందిన ఫకీర్ మహమ్మద్ సయ్యద్(50) బుధవారం నాలుగు దున్నపోతులు,ఒక గేదెను వాహనంలో అహ్మదాబాద్ తరలించబోయాడు. అయితే మార్గమధ్యలోనే సయ్యద్ వాహనాన్ని అడ్డుకున్న ఇద్దరు వ్యక్తులు.. వైష్ణోదేవి సర్కిల్‌ నుంచి రింగ్ రోడ్ వైపు దాన్ని మళ్లించారు. జుందాల్ ప్రాంతానికి చేరుకోగానే రెండు బిల్డింగ్స్ మధ్య ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లి వాహనాన్ని అక్కడ నిలిపారు.

ఆ ఇద్దరు మరో 10మందిని అక్కడికి రప్పించడంతో.. తాము గోరక్షక దళానికి చెందిన వ్యక్తులమని.. అంతా కలిసి అతన్ని బెదిరించారు. అక్రమంగా గోవులను వేరే చోటుకు తరలిస్తున్నట్టు ఒప్పుకోవాలని తీవ్రంగా హెచ్చరించారు. అందుకు సయ్యద్ ఒప్పుకోకపోవడంతో కర్రలతో అతన్ని తీవ్రంగా కొట్టారు. దాడిలో అతని కుడి కాలు విరిగిపోగా.. ఎడమ చేయి ఫ్రాక్చర్ అయింది. అంతేకాదు, సదరు వ్యక్తులు తనకు నిప్పంటించడానికి కూడా ప్రయత్నించారని బాధితుడు సయ్యద్ 'న్యూస్18'తో చెప్పారు. మొబైల్ ఫోన్‌తో పాటు అతని వద్ద ఉన్న రూ.10వేలు నగదు బలవంతంగా లాక్కున్నారు.


ఘటనపై కేసు నమోదు చేసుకుని గాంధీనగర్ జిల్లా అదాలజ్ పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. ఆనంద్ రబరి, లభు, రబరి, వఘు రబరి అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితుడు సయ్యద్ వెహికల్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు.
First published: August 23, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...