మన దేశం (India)లో కులం (Caste), మతం (Religion) పేర్లతోనే ఓటు బ్యాంకు రాజకీయాలు నడుస్తాయి. పొలిటికల్ పార్టీలన్నీ ఫాలో అయ్యే స్ట్రాటజీ ఇది. ఎన్నికల కాలంలో పొలిటికల్ పార్టీలు ఆ ప్రాంతాల్లో ఉండే మేజర్ కులమేదో గుర్తించి, ఆ కులానికి చెందిన వ్యక్తికి టికెట్ కేటాయించడం పరిపాటి. అయితే ఇలాంటి పోకడలను ఓటర్లు గుర్తించాలని, కులం ప్రస్తావన లేకుండా ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నాడు ఒక నాస్తికుడైన ఆటో డ్రైవర్. గుజరాత్‌లోని గాంధీనగర్‌కు చెందిన ఈ వ్యక్తి.. అక్కడ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నాడు. ఎలక్షన్ క్యాంపెయిన్‌లో కులరహితంగా ఓట్లు వేయడంపై అవగాహన కల్పిస్తున్నాడు.
* పేరు మార్చుకున్నాడు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఈ 38 ఏళ్ల ఆటో డ్రైవర్ పేరు రాజ్ వీర్. ఎలక్షన్ల సందర్భంగా ఇతడు తన పేరును RV155677820గా మార్చుకున్నాడు. దీంతో అతని మతం, కులం గురించిన వివరాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. చంద్ఖేడావాసి అయిన రాజ్ వీర్, గాంధీనగర్ సౌత్ అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతున్నాడు. తన పేరు మార్పుతో కమ్యునిటీ లేబుల్స్ అన్నీ దూరమయ్యాయని చెబుతున్నాడు.
* ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే?
రాజ్వీర్ పోటీ చేస్తున్న గాంధీ నగర్ సౌత్‌లో 2017లో బీజేపీ గెలిచింది. ఈ నియోజకవర్గ జనాభాలో చాలా ఎక్కువ మంది పటేళ్లు, ఠాకూర్లు ఉన్నారు. దీంతో ఇప్పడు ఈ ఎన్నికల్లో బీజేపీ అల్పేష్ ఠాకూర్ అనే అభ్యర్థిని బరిలోకి దింపింది. కాంగ్రెస్ డాక్టర్ హిమాన్షు పటేల్‌కు టికెట్ లభించింది. కులాల ప్రాతిపదిక మీదే ఈ ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులకు టికెట్లను కేటాయించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీంతో మిస్టర్ RV155677820 ఆలోచనలో పడ్డాడు.
అయితే పేరు మార్చుకోవడానికి రాజ్వీర్ చాలా ప్రయత్నాలే చేశాడు. మే 2015లో RV155677820గా తన పేరును మార్చుకోవాలంటూ రాజ్‌కోట్‌లోని గెజిట్ ఆఫీసు, అహ్మదాబాద్ జిల్లా కలెక్టరేట్లో పిటీషన్లు పెట్టకున్నాడు. 2017లో ఈ రెండు అభ్యర్థనలను అధికారులు తిరస్కరించారు. దీంతో అతడు 2019లో గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. ఇప్పటికీ ఈ కేసు పెండింగ్‌లో ఉంది.
ఇది కూడా చదవండి : రాహుల్ గాంధీకి ప్రాణహాని..బాంబులతో చంపేస్తాం అంటూ బెదిరింపు లేఖ కలకలం
ఈసీ(EC)కి దాఖలు చేసిన అఫిడవిట్లో ఇతను తన కులం, మతం, వర్గాన్ని పొందుపరచలేదు. ఆ వివరాలు ఇవ్వనందున తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తే కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఈ సమయంలో ఎలాంటి ఘర్షణ జరిగినా ధైర్యంగా పోరాడాలని నిశ్చయించుకున్నాడు. అందుకు ముందుగానే మానసికంగా సిద్ధపడినట్లు చెబుతున్నాడు.
* నాస్తికుడు, సైకాలజీ స్టూడెంట్
తనని తాను నాస్తికుడుగా చెప్పుకునే రాజ్వీర్, క్లినికల్ సైకాలజీ విద్యార్థి. కులం, మతం కారణంగా అభ్యర్థిని ఎన్నుకునే ఫార్ములాను తాను అనుసరించనని చెబుతున్నాడు. మన దేశ రాజ్యాంగంలోని సెక్యులరిజానికి ఇది విరుద్ధమని, కుల, మతాలకు అతీతమైన సమాజం కోసం పాటుపడతానని చెప్పాడు. గుజరాత్లో బీజేపీ, కాంగ్రెస్‌లు కులం కార్డుతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని, ప్రజలు దీన్ని గుర్తించి అభ్యర్థుల అర్హత ఆధారంగా ఓట్లు వేయాలని కోరుతున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gujarat, Gujarat Assembly Elections 2022, National News, VIRAL NEWS