Gujarat Elections 2022 : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరిదైన రెండో విడత (Second Phase) పోలింగ్ జరగనుంది. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉండగా.. తొలి విడతలో 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మిగతా 93 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడతలో 19 జిల్లాల్లో ఎన్నికలు జరిగితే.. రెండో విడతలో.. సెంట్రల్, నార్త్ గుజరాత్‌లోని 14 జిల్లాల్లో జరగనున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తాయి. మొత్తం 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
రెండో దశలో 2.54 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయబోతున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం 26,409 పోలింగ్ కేంద్రాల్ని సిద్ధం చేసింది. 36వేల EVMలను వినియోగిస్తోంది. రెండో దశలో కీలకమైన అహ్మదాబాద్, గాంధీనగర్, వడోదర, బనస్కాంత, పంచమహల్, అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ ఉదయం 8.30కి అహ్మదాబాద్‌లో ఓటు వేస్తారు. నిన్న గాంధీనగర్ వెళ్లిన ఆయన తల్లి హీరాబెన్‌తో రెండు గంటలు గడిపి.. టీ తాగి.. పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
Gujarat | Prime Minister Narendra Modi meets his mother Heeraben Modi at her residence, in Gandhinagar. pic.twitter.com/3Rtg3gJ3ON
— ANI (@ANI) December 4, 2022
ఇదే కీలకం
సాధారణంగా పోలింగ్ శాతం తక్కువగా నమోదైతే.. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఉంటుందనేది విశ్లేషకుల మాట. డిసెంబర్ 1న జరిగిన తొలివిడతలో 63.31 శాతం పోలింగే జరగడంతో.. ప్రతిపక్ష కాంగ్రెస్ , కేజ్రీవాల్ సారధ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆందోళన చెందాయి. ఎలాగైనా ఓటర్లను పోలింగ్ బూత్‌కి తేవాలని రెండో దశపై ఎక్కువ ఫోకస్ పెట్టాయి. సర్వేలు చెప్పినట్లు మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే.. ఈ ఫలితం కేంద్రంలో NDA ప్రభుత్వానికి కలిసొస్తుంది. అలా కాకుండా ప్రతిపక్షాలకు అనుకూలంగా తీర్పు వస్తే.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి ఒకింత ఇబ్బందే. మోదీ సొంత రాష్ట్రంలో బీజేపీ ఓడిపోయిందనీ.. దేశవ్యాప్తంగా కమలానికి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ప్రతిపక్షాలు ప్రచారం చేసే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రధాని మోదీ .. అన్నీ తానై ఈ ఎన్నికల్లో విస్తృత ప్రచారం, ర్యాలీలు చేశారు.
ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్, ఆప్ మధ్య చీలిపోతుందనీ.. అందువల్ల మరోసారి తమకు కలిసొస్తుందని బీజేపీ భావిస్తోంది. ఈ అంచనాయే నిజమైతే.. ఆప్ రాకతో కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ తగిలినట్లు అవుతుంది. అదే సమయంలో అధికారం దక్కకపోయినా.. ఆప్ గుజరాత్లో ప్రభావం చూపిన పార్టీగా అవతరిస్తుంది. ఐతే.. ఆప్‌కి పల్లెల్లో అంతగా పట్టులేదు కాబట్టి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకే దక్కి.. అధికారం చేజిక్కించుకుంటామని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇలా ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. ఫలితాలు డిసెంబర్ 8న రానున్నాయి. అదే రోజు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gujarat, Gujarat Assembly Elections 2022, International news, Telugu news