Gujarat Elections 2022 : నేడు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత (First Phase) పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 5 గంటలకు అది ముగుస్తుంది. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉండగా.. తొలి విడతలో మొత్తం 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా స్థానాలకు రెండో విడతలో పోలింగ్ జరగనుంది. తొలి దశలో 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 70 మంది మహిళలు ఉండగా.. 339 మంది స్వతంత్ర (Independent) అభ్యర్ధులున్నారు. ఈ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం మొత్తం 25,430 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేసింది. తొలిదశలో మొత్తం 2,39,76,670 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. సౌరాష్ట్ర - కచ్, గుజరాత్ దక్షిణ ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
కీలకమైన ఎన్నికలు :
ఈ ఎన్నికలను అన్ని పార్టీలూ సవాలుగా తీసుకున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీ .. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలంటే.. ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. అదీ కాక.. గుజరాత్ .. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సొంత రాష్ట్రం. అక్కడ పార్టీ ఓడితే.. అది కేంద్రంలో బీజేపీకి ఎదురుదెబ్బలా ఉంటుంది. అందుకే ఈ ఎన్నికల్లో మోదీ.. విస్తృత ప్రచారం చేశారు.
ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఈ ఎన్నికలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇందులో గెలవడం ద్వారా దేశవ్యాప్తంగా మళ్లీ పుంజుకోవాలన్నది ఆ పార్టీ ప్లాన్. దశాబ్దాలుగా ప్రతిపక్షంగా ఉన్న ఆ పార్టీ.. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందని అనుకుంటోంది. అటు గుజరాత్ ఎన్నికల సమరంలో తొలిసారి ఎంట్రీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP).. గుజరాత్లో బోణీ చెయ్యాలని చూస్తోంది. పంజాబ్ తరహాలోనే ఇక్కడ కూడా ప్రజలు తమను ఆదరిస్తారని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఐతే.. ఆప్ ఎంట్రీ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ , ఆప్ మధ్య చీలిపోయి.. తమకు కలిసొస్తుందని బీజేపీ అనుకుంటోంది. ఇలా త్రిముఖపోరు.. ఆసక్తి రేపుతోంది.
Winter Pregnancy Care : చలికాలంలో గర్భిణీలకు ఆహార జాగ్రత్తలు.. తప్పక పాటించండి
రెండో దశ పోలింగ్ డిసెంబర్ 5న 93 స్థానాలకు జరుగుతుంది. గుజరాత్లో వరుసగా నాలుగోసారి ప్రజలు బీజేపీకి పట్టం కడతారా లేక కాంగ్రెస్, ఆప్ వైపు చూస్తారా అన్నది కీలకమైన అంశం. సర్వేలు మాత్రం బీజేపీయే గెలుస్తుందని అంచనా వేశాయి. అధికార పార్టీపై వ్యతిరేకత అంతగా లేదనీ.. ప్రతిపక్ష కాంగ్రెస్ బలహీనంగా ఉందనీ.. ఇక ఆప్‌కి క్షేత్రస్థాయిలో కార్యకర్తలే లేరనీ.. అందువల్ల ఈసారి కూడా బీజేపీకే అనుకూలమైన తీర్పు వస్తుందని సర్వేలు అంటున్నాయి. మరి ప్రజలు ఏం నిర్ణయిస్తారన్నది ఆసక్తికరం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.