గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఐదు స్థానాల్లో విజయం సాధించింది. పంజాబ్‌లాగే ఇక్కడ కూడా అధికారం చేపడతామని కేజ్రీవాల్ చెప్పినప్పటికీ.. తక్కువ సీట్లకే పరిమితమైంది. బోటాడ్, గరియాధర్, దేడియాపద, జంజోధ్పూర్, విశావదర్‌లో ఆప్ గెలిచింది. ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గధ్వి.. ఖంభాలియా నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు వచ్చేశాయి. గుజరాత్(Gujarat Election Result)లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. మోదీ (Narendra Modi), అమిత్ షా (Amit Shah) ఇలాఖాలో తమకు ఎదురులేదని మరోసారి నిరూపించింది. గతంలో ఎప్పుడూ లేనన్ని ఎక్కువ సీట్లు గెలిచి.. చారిత్రక విజయం సాధించిన బీజేపీ.. వరుసగా ఏడోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. హిమాచల్ ప్రదేశ్( Himachal Pradesh Election Result)లో మాత్రం ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ.. ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని..అక్కడి ప్రజలు ఈసారి కూడా కొనసాగించారు. బీజేపీని ఓడించి.. కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు. హిమాచల్ ప్రదేశ్‌లో హోరాహోరీ తప్పదన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. సంపూర్ణ మెజారిటీతో హస్తం పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది.
గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ సీట్లున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 92 సీట్లు అవసరమవగా.. బీజేపీ 156 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 17, ఆమాద్మీ 5 సీట్లలో విజయం సాధించింది. ఇతరులకు 4 స్థానాలు వచ్చాయి. బీజేపీకి ఏకంగా 156 సీట్లు రావడంతో.. వార్ వన్‌సైడ్ అయింది. గుజరాత్ చరిత్రలోనే ఈ స్థాయి సీట్లు ఎవరికీ ఎప్పుడూ రాలేదు. గుజరాత్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. 1985లో కాంగ్రెస్ పార్టీ 149 సీట్లను సాధించింది. ఇప్పుడా రికార్డును బీజేపీ బద్ధలు కొట్టబెట్టింది. ఈ విజయంతో వరుసగా 7వ సారి అధికారం కైవపం చేసుకుంది. బీజేపీ అక్కడ 27 ఏళ్లుగా అధికారంలో ఉంది. ఈసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండడంతో.. పశ్చిమ బెంగాల్లో వరుసగా గెలిచిన సీపీఎం రికార్డును ఆ పార్టీ సమం చేసింది.
హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం బీజేపీకి షాక్ తగిలింది. అక్కడ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాల్లో40 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ 25 సీట్లకే పరిమితమయింది. ఇతరులు మూడు చోట్ల గెలిచారు. 35 ఏళ్ల హిమాచల్ ఎన్నికల చరిత్ర చూస్తే... ఇక్కడ ఏ పార్టీ కూడా వరుసగా రెండు సార్లు గెలవలేదు. ఒకసారి బీజేపీ గెలిస్తే.. ఒకసారి కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది. ఈసారి కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అయింది. అధికార పార్టీ బీజేపీకి షాకిచ్చిన ప్రజలు.. కాంగ్రెస్‌కి పట్టం గట్టారు. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబరు 12న ఒకే దశలో పోలింగ్ జరిగింది. 74శాతం ఓటింగ్ నమోదయింది. ఈ ఎన్నికలతో ఆమాద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించింది. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్ .. గోవా, గుజరాత్ ఎన్నికల్లోనూ 6శాతానికిపైగా ఓట్లను సాధించడంతో.. జాతీయ హోదాను దక్కించుకుంది.