గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు వచ్చేశాయి. గుజరాత్(Gujarat Election Result)లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. మోదీ (Narendra Modi), అమిత్ షా (Amit Shah) ఇలాఖాలో తమకు ఎదురులేదని మరోసారి నిరూపించింది. గతంలో ఎప్పుడూ లేనన్ని ఎక్కువ సీట్లు గెలిచి.. చారిత్రక విజయం సాధించిన బీజేపీ.. వరుసగా ఏడోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. హిమాచల్ ప్రదేశ్( Himachal Pradesh Election Result)లో మాత్రం ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ.. ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని..అక్కడి ప్రజలు ఈసారి కూడా కొనసాగించారు. బీజేపీని ఓడించి.. కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు. హిమాచల్ ప్రదేశ్‌లో హోరాహోరీ తప్పదన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. సంపూర్ణ మెజారిటీతో హస్తం పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది.
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయానికి 5 ప్రధాన కారణాలు.
గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ సీట్లున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 92 సీట్లు అవసరమవగా.. బీజేపీ 156 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 17, ఆమాద్మీ 5 సీట్లలో విజయం సాధించింది. ఇతరులకు 4 స్థానాలు వచ్చాయి. బీజేపీకి ఏకంగా 156 సీట్లు రావడంతో.. వార్ వన్‌సైడ్ అయింది. గుజరాత్ చరిత్రలోనే ఈ స్థాయి సీట్లు ఎవరికీ ఎప్పుడూ రాలేదు. గుజరాత్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. 1985లో కాంగ్రెస్ పార్టీ 149 సీట్లను సాధించింది. ఇప్పుడా రికార్డును బీజేపీ బద్ధలు కొట్టబెట్టింది. ఈ విజయంతో వరుసగా 7వ సారి అధికారం కైవపం చేసుకుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండోసారి భూపేంద్ర పటేల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 12న ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.
గుజరాత్లో 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. ఈసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో.. పశ్చిమ బెంగాల్లో వరుసగా గెలిచిన సీపీఎం రికార్డును ఆ పార్టీ సమం చేసింది. ఇన్నేళ్లుగా అధికారంలో ఉన్నా.. బీజేపీ పట్లఎక్కడా ప్రజా వ్యతిరేకత కనిపించలేదు. పైగా మరిన్ని ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఏకంగా 52.50శాతం ఓట్లు వచ్చాయి. ఈసారి ఆమాద్మీ పార్టీ బరిలోకి దిగడం బీజేపీకి బాగా కలిసి వచ్చింది. కాంగ్రెస్ ఓట్లను చీల్చడంతో... బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చాయి. పంజాబ్ తరహాలో ఇక్కడ గెలుస్తామన్న కేజ్రీవాల్ ఆశలు... మోదీ-షా మేనియాలో గల్లంతయ్యాయి.
గుజరాత్ ఎన్నికల తుది ఫలితాలు:
మొత్తం సీట్లు: 182
మ్యాజిక్ ఫిగర్: 92
బీజేపీ: 156
కాంగ్రెస్: 17
ఆమాద్మీ: 5
ఇతరులు: 4
కాగా, గుజరాత్(Gujarat)లో డిసెంబరు 1న తొలిదశ ఎన్నికలు, డిసెంబరు 5న రెండో దశ ఎన్నికలు జరిగాయి. తొలి దశలో 89 నియోజకవర్గాల్లో, రెండో విడతలో 93 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. తొలి దశలో 63.3 శాతం, రెండో దశలో 64.65 శాతం పోలింగ్ నమోదయింది.
హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం బీజేపీకి షాక్ తగిలింది. అక్కడ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాల్లో40 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ 25 సీట్లకే పరిమితమయింది. ఇతరులు మూడు చోట్ల గెలిచారు. 35 ఏళ్ల హిమాచల్ ఎన్నికల చరిత్ర చూస్తే... ఇక్కడ ఏ పార్టీ కూడా వరుసగా రెండు సార్లు గెలవలేదు. ఒకసారి బీజేపీ గెలిస్తే.. ఒకసారి కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది. ఈసారి కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అయింది. అధికార పార్టీ బీజేపీకి షాకిచ్చిన ప్రజలు.. కాంగ్రెస్‌కి పట్టం గట్టారు. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబరు 12న ఒకే దశలో పోలింగ్ జరిగింది. 74శాతం ఓటింగ్ నమోదయింది.
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తుది ఫలితాలు:
మొత్తం సీట్లు: 68
మ్యాజిక్ ఫిగర్: 35
కాంగ్రెస్: 40
బీజేపీ: 25
ఆమాద్మీ: 0
ఇతరులు: 3
ఈ ఫలితాల అనంతరం ఆమాద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించింది. పదేళ్ల క్రితం రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన ఆప్ .. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఏదైనా పార్టీకి జాతీయ హోదా దక్కాలంటే ఏవైనా నాలుగు రాష్ట్రాల్లో కనీసం 6శాతం ఓట్లు సాధించాల్సి ఉంది. ఐతే ఆమాద్మీ ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉంది. గోవా ఎన్నికల్లో ఆరు శాతానికి పైగా ఓట్లు సాధించింది. గుజరాత్‌లోనూ 13శాతం మేర ఓట్లు సాధించింది. హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం 1.10శాతానికే పరిమితమైంది. ఢిల్లీ, పంజాబ్, గోవా, గుజరాత్లో ఆరు శాతానికి పైగా ఓట్లు ఉండడంతో.. ఆమాద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించినట్లయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aam Aadmi Party, AAP, Bjp, Congress, Gujarat Assembly Elections 2022, Himachal Pradesh Elections 2022