Gujarat Elections: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో (Gujarat Assembly Elections) గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ మొదటి విడతగా 89 నియోజకవర్గాలకు పోలింగ్ పూర్తయింది. డిసెంబర్ 5న రెండో విడతలో 93 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. గుజరాత్లో వరుసగా ఏడోసారి గెలుపు దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ పూర్తిగా ప్రధాని మోదీనే నమ్ముకొంది. ఈ సందర్భంగా గురువారం అహ్మదాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) హైవోల్టేజీ ప్రచారం నిర్వహించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కూడా ప్రచారజోరు కొనసాగించారు. ఆయనతోపాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, మాజీ క్రికెటర్, రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ కూడా పాల్గొన్నారు.
నరోదా గామ్ నుంచి మొదలైన బీజేపీ ప్రచారం
పంచమహల్‌లోని కలోల్, చోటా ఉదేపూర్లోని బోడేలి, సబర్కాంత జిల్లాలోని హిమత్నగర్లలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగించిన తర్వాత మోదీ అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. గోద్రాలోని సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం తర్వాత 2002లో అల్లర్లు చెలరేగిన ప్రాంతం నరోదా గామ్ నుంచి ఓపెన్ రూఫ్ వాహనంలో మోదీ రోడ్‌షోను ప్రారంభించారు. ఆయన దారిలో సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, దీనదయాళ్ ఉపాధ్యాయ విగ్రహాల వద్ద నివాళులర్పించారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు..ఓటేసిన టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా..పోలింగ్ శాతం ఎంతం
* సుదీర్ఘ రోడ్ షోతో మోదీ రికార్డ్
రోడ్‌షో అహ్మదాబాద్ నగరంలోని 16 నియోజకవర్గాలలో 12 నియోజకవర్గాల గుండా వెళ్ళింది. ఒక నియోజకవర్గం మాత్రం గాంధీనగర్ దక్షిణ పరిధిలోకి వస్తుంది. నరోడా, ఠక్కర్‌బాపానగర్, బాపునగర్, నికోల్, అమ్రైవాడి, మణినగర్, డానిలింబ్డా, జమాల్పూర్ ఖాడియా, ఎలిస్‌బ్రిడ్జ్, వేజల్పూర్, ఘట్లోడియా, నారన్‌పూర్, సబర్మతి, గాంధీనగర్ సౌత్ మీదుగా మోదీ రోడ్‌షో సాగింది. మోదీ మెగా రోడ్ షో దాదాపు 50 కిలోమీటర్లు సాగింది. ఈ వినూత్న ప్రచారంతో దేశంలోనే ఇంత సుదీర్ఘ రోడ్ షో నిర్వహించిన నేతగా మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ రోడ్ షోలో వేలాది మంది భాజపా కార్యకర్తలు, అభిమానులు కాషాయ జెండాలు పట్టుకొని డప్పులు వాయిస్తూ ముందుకు సాగుతున్న దృశ్యాలు పండుగను తలపించాయి.
Gujarat Polling : సైకిల్‌కు సిలిండర్ కట్టుకుని వెళ్లి ఓటు వేసిన ఎమ్మెల్యే
పంజాబ్ ఉచిత విద్యుత్ బిల్లులు పంపిణీ చేసిన కేజ్రీవాల్
భాజపా ప్రచార జోరును మోదీ రోడ్ షో మరో స్థాయికి తీసుకెళ్లింది. అయితే మరోపక్క అహ్మదాబాద్‌లో పంజాబ్ వాసుల ఉచిత విద్యుత్ బిల్లులను కేజ్రీవాల్ పంపిణీ చేశారు. మోదీ మెగా ర్యాలీకి కొన్ని గంటల ముందు, అహ్మదాబాద్‌లోని బాపునగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సరస్‌పూర్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రోడ్‌షో నిర్వహించారు.
ఆప్ వస్తే ప్రతి ఒక్కరికీ నెలకు రూ.30 వేలు ఆదా
ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. పంజాబ్‌లో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీని అమలు చేసినట్లు చెప్పారు. పంజాబ్ ప్రజలకు వచ్చిన ఉచిత విద్యుత్ బిల్లులను పంపిణీ చేశారు. ఈ విద్యుత్ బిల్లులను ఎవరైనా పరిశీలించవచ్చని చెప్పారు. గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే.. గుజరాత్లో కూడా ఉచిత విద్యుత్ హామీని అమలు చేస్తామని ఢిల్లీ సీఎం అన్నారు. ప్రచారానికి ఒక రోజు ముందు, మన్ పంజాబ్ నుంచి 25,000 ఉచిత విద్యుత్ బిల్లులను తీసుకొచ్చారు.
ప్రచారంలో హర్బజన్ సింగ్ మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్, ఉచిత విద్య , వైద్యం, 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ.1000 సాయం, నిరుద్యోగ పథకాల కింద రూ.3 వేలు ఆమ్ ఆద్మీ పార్టీ అందిస్తుందని చెప్పారు. ఇలా గుజరాత్‌లోని ప్రతి వ్యక్తి నెలకు రూ.30,000 ఆదా చేసుకోగలరని చెప్పారు. మార్పు కోసం ఆప్‌కి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.