గుజరాత్(Gujarat Assembly Results)లో తమకు తిరుగులేదని బీజేపీ మరోసారి నిరూపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురులేని మెజారిటీతో పాత రికార్డులను బద్ధలు కొడుతోంది. మొత్తం 182 సీట్లున్న గుజరాత్ల ఏకంగా 150కి పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ట్రెండ్స్ చూస్తుంటే.. 150 సీట్లల్లో కమలం పార్టి విజయం సాధించనున్నట్లు స్పష్టమవుతోంది. గుజరాత్ చరిత్రలోనే ఈ స్థాయి సీట్లు ఎవరికీ ఎప్పుడూ రాలేదు. గుజరాత్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. 1985లో కాంగ్రెస్ పార్టీ 149 సీట్లను సాధించింది. ఇప్పుడా రికార్డును బీజేపీ బద్ధలు కొట్టబోతోంది.
AAP : దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఆప్ .. గుజరాత్లో ప్రధాన ప్రతిపక్షం అవుతుం
2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 99 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 77 సీట్లు దక్కాయి. 2012 ఎన్నికల్లో బీజేపీకి 115 సీట్లు, 2007లో 117, 2002లో 127, 1998లో 117, 1995లో 121 స్థానాల్లో విజయం సాధించింది. ఐతే ఈసారి ఏకంగా 150కి పైగా సీట్లు వస్తుండడంతో.. కాషాయ దళంలో సరికొత్త జోష్ కనిపిస్తోంది. ఏకపక్ష విజయంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.
బీజేపీ పక్కా వ్యూహంతో ఈ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించింది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండకుండా జాగ్రత్త పడింది. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మందికి సీట్లు ఇవ్వలేదు. ఏకంగా 38 మంది ఎమ్మెల్యేలను పక్కనబెట్టి.. కొత్త వారికి టికెట్లు ఇచ్చారు. అభ్యర్థుల ఎంపికలో అమిత్ షా అన్నీ తానై వ్యవహరించారు. దాదాపు 35 ఎన్నికల సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని బీజేపీకి ప్రచారం చేశారు.
Gujarat Election Results : గుజరాత్ ఫలితాలతో దేశంలో వచ్చే మార్పులేంటి?
మరోవైపు కాంగ్రెస్ పార్టీ దారుణ పరాభవాన్ని మూట్టగట్టుకుంది. ఎప్పుడూ లేనంత తక్కువ సీట్లకు పరిమితం కాబోతోంది. 20 కంటే తక్కువ స్థానాలే ఆ పార్టీకి దక్కే అవకాశం కనిపిస్తోంది. భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్న రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికల్లో ప్రచారం చేయకపోవడం.. ఆ పార్టీకి మైనస్‌గా మారింది. తొలిసారి గుజరాత్ ఎన్నికల్లో పోటీచేసిన ఆమాద్మీ పార్టీ .. కాంగ్రెస్ ఓట్లకు భారీగా గండికొట్టడంతో.. హస్తం పార్టీకి తక్కువ సీట్లు వచ్చాయి.
గుజరాత్లో 1995 నుంచి అధికారంలో ఉన్న బీజేపీ.. ఇప్పుడు వరుసగా ఏడోసారి అధికారం చేపట్టబోతోంది. గతంలో ఒక్క సీపీఎంకు మాత్రమే ఇన్నిసార్లు గెలిచిన చరిత్ర ఉంది. పశ్చిమ బెంగాల్లో వరుసగా ఏడుసార్లు ఆ పార్టీ విజయం సాధించింది. ఇప్పుడా రికార్డును బీజేపీ సమం చేసింది. గుజరాత్లో నరేంద్ర మోదీ ఎక్కువ కాలం సీఎంగా పనిచేశారు. 2001 నుంచి 2014 వరకు ఆయన గుజరాత్ సీఎంగా పనిచేశారు. ప్రస్తుతం గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ఉన్నారు. తదుపరి సీఎం ఎవరన్న దానిపై అతి త్వరలోనే క్లారిటీ రానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Congress, Gujarat, Gujarat Assembly Elections 2022