Home /News /national /

GST COUNCIL MEET PRE PACKED ITEMS UNDER GST 28 PERCENTAGE TAX ON CASINO DEFERRED UMG GH

GST Council: హాస్పిటల్ రూమ్స్‌కి కూడా ఇక జీఎస్టీ.. బెట్టింగ్‌లపై మాత్రం పెండింగ్.. కౌన్సిల్ నిర్ణయాలు ఇవే..!

జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి హాజరైన నిర్మలా సీతారామన్ (Photo: Twitter)

జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి హాజరైన నిర్మలా సీతారామన్ (Photo: Twitter)

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం మంగళ, బుధవారాల్లో చండీగఢ్‌లో రెండు రోజుల పాటు జరిగింది. కౌన్సిల్ తుది నిర్ణయాన్ని బుధవారం ప్రకటించింది. ఆ వివరాలు..

తాజాగా నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్‌(GST Council) సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హాస్పిటల్‌ రూమ్‌, హోటల్‌ రూమ్‌లపై కూడా ఇకపై జీఎస్‌టీ విధించనున్నారు. పెరుగు, లస్సీ, వెన్న పాలతో సహా ప్రీ-ప్యాకేజ్డ్(Pre-packaged), ప్రీ-లేబుల్(Pre Labelled) రిటైల్ ప్యాక్‌లను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువచ్చారు. అయితే క్యాసినోలు, ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందేలపై పన్ను విధించడాన్ని మంత్రుల బృందం పునఃపరిశీలించనుంది. నివేదికను సమర్పించేందుకు జూలై 15 వరకు సమయం ఉంది. ఈ కార్యకలాపాలపై 28 శాతం పన్ను విధించే ప్రతిపాదనను వాయిదా వేసింది. పన్ను శ్లాబ్ రేషనలైజేషన్‌పై నివేదికను సమర్పించడానికి మంత్రుల బృందానికి మూడు నెలల సమయం ఇచ్చారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం మంగళ, బుధవారాల్లో చండీగఢ్‌లో రెండు రోజుల పాటు జరిగింది. కౌన్సిల్ తుది నిర్ణయాన్ని బుధవారం ప్రకటించింది. జీఎస్టీ కాంపెన్షేషన్‌ సెస్‌ను కొన్ని రాష్ట్రాలు ఐదేళ్లు కాకపోయినా కనీసం కొంత కాలం పాటు కొనసాగించాలని కోరుతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. కొన్ని రాష్ట్రాలు తమ వనరులను తామే భర్తీ చేసుకునేందుకు మార్గాలను అన్వేషించాలని, కేంద్ర పరిహారంపై ఆధారపడకూడదని భావిస్తున్నట్లు తెలిపారు.

జీఎస్టీ ఎక్కడ పెరిగింది, ఎక్కడ తగ్గింది
బ్రాండ్‌ లేబుల్‌ చేయని, ప్యాక్‌ చేయని నిర్దిష్ట ఆహార పదార్థాలు, ధాన్యాలు మొదలైన వాటిపై జీఎస్‌టీని మినహాయించారు. పెరుగు, లస్సీ, వెన్న పాలతో సహా ప్రీ-ప్యాకేజ్డ్, ప్రీ-లేబుల్డ్ రిటైల్ ప్యాక్‌లపై జీఎస్‌టీ విధించారు. కొన్ని వస్తువులు, సేవలపై రేట్లు కూడా మారాయి. 47వ జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు చేసిన రేట్ల మార్పులు జూలై 18 నుంచి అమల్లోకి వస్తాయి. చెక్కుల జారీకి బ్యాంకులు వసూలు చేసే రుసుములపై 18 శాతం జీఎస్‌టీ విధించాలని కౌన్సిల్ నిర్ణయించింది. రోజుకు రూ.1,000లోపు రుసుము వసూలు చేసే హోటల్ గదులపై 12 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.

ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండానే, ICU మినహా, ఆస్పత్రిలో రోగి చెల్లించే గది అద్దె రూ.5,000 కంటే ఎక్కువ ఉంటే 5 శాతం పన్ను విధిస్తారు. అట్లాస్‌లు, వాల్ మ్యాప్‌లు, టోపోగ్రాఫికల్ ప్లాన్‌లు, గ్లోబ్‌లతో సహా అన్ని రకాల మ్యాప్‌లు, హైడ్రోగ్రాఫిక్ చార్ట్‌లపై 12 శాతం జీఎస్‌టీ విధించాలని కౌన్సిల్ నిర్ణయించింది.

RBI, IRDAI, Sebi, FSSAI సేవలపై జీఎస్‌టీ మినహాయింపు కూడా ఉపసంహరించారు. పెట్రోలియం/ కోల్‌బెడ్ మీథేన్‌పై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచారు. ఈ-వేస్ట్‌పై కూడా 5 శాతం నుంచి 18 శాతానికి పెంచారు. ప్రభుత్వ నిధులతో పరిశోధనా సంస్థలకు సరఫరా చేసే శాస్త్రీయ, సాంకేతిక పరికరాలపై పన్ను 5 శాతం నుంచి వర్తించే రేటుకి పెంచారు.

ఓస్టోమీ ఉపకరణాలపై (పౌచ్ లేదా ఫ్లేంజ్, బారియర్ క్రీమ్, స్లీవ్‌లు, ఇరిగేటర్ కిట్, మైక్రో-పోర్ టేపులు, స్టోమా అంటుకునే పేస్ట్, బెల్ట్‌తో సహా) జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ఆర్థోపెడిక్ ఉపకరణాలపై (స్ప్లింట్స్, ఇతర ఫ్రాక్చర్ ఉపకరణాలు) రేటును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. కృత్రిమ శరీర భాగాలు(వైకల్యాన్ని భర్తీ చేయడానికి ధరించే, శరీరంలో అమర్చిన ఇతర ఉపకరణాలు), ఇంట్రాకోక్యులర్ లెన్స్‌పై కూడా జీఎస్‌టీ 5 శాతానికి తగ్గింది.

ఇదీ చదవండి: జీఎస్‌టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు.. వ్యాపారులకు గుడ్ న్యూస్.. మార్పులివే..!


నేషనల్ ఫైలేరియాసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కోసం ఉచితంగా సరఫరా చేసే డైథైల్కార్బమాజైన్ (DEC) టాబ్లెట్‌ల దిగుమతిపై IGST, తుది వినియోగదారు అయినప్పుడు రక్షణ దళాలు ప్రైవేట్ సంస్థలు/అమ్మకందారులు దిగుమతి చేసుకున్న నిర్దిష్ట రక్షణ వస్తువులపై IGSTని మినహాయించారు.

* ఆన్ రేట్ రేషనలైజేషన్‌కు అదనపు సమయం
రేట్ రేషనలైజేషన్‌పై మంత్రుల బృందానికి మూడు నెలల సమయం ఇచ్చారు.

*క్యాసినో, ఆన్‌లైన్‌ గేమ్స్‌పై పనఃపరిశీలన
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని జీఎస్‌టీ కౌన్సిల్ క్యాసినోలు, ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందేలపై విధించే పన్ను అంశాన్ని మళ్లీ పరిశీలించాలని మంత్రుల బృందాన్ని(GoM) ఆదేశించింది. జూలై 15 వరకు నివేదికను సమర్పించేందుకు గడువు ఇచ్చింది. ప్రస్తుతానికి క్యాసినోలు, ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందేలు, లాటరీలపై 28 శాతం పన్ను విధించే ప్రతిపాదనను కౌన్సిల్ వాయిదా వేసింది.

జీఎస్‌టీ IT ఇన్ఫ్రాస్ట్రక్చర్
IT సంస్కరణలపై రిజిస్ట్రేషన్ దరఖాస్తుదారుల పూర్వపరాలను ధ్రువీకరించడానికి, రిజిస్ట్రేషన్ తర్వాత రిస్క్-ఆధారిత పర్యవేక్షణను ధ్రువీకరించడానికి కృత్రిమ మేధస్సు/మెషిన్ లెర్నింగ్-ఆధారిత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.

చిన్న ఆన్‌లైన్ విక్రేతలకు మినహాయింపు
అసంఘటిత రంగంలోని వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేందుకు, ఆన్‌లైన్‌లో తమ ఉత్పత్తులను విక్రయించే చిన్న సంస్థలకు తప్పనిసరి రిజిస్ట్రేషన్‌ను మినహాయించాలని జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయించింది. రూ.20 లక్షల వరకు వార్షిక టర్నోవర్ ఉన్నవారికి, అంతర్-రాష్ట్ర పన్ను పరిధిలోకి వచ్చే వారికి మినహాయింపు ఉంటుంది.
Published by:Mahesh
First published:

Tags: GST, GST Council, Hospitals, Nirmala sitharaman

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు