న్యూఢిల్లీ: తమిళనాడులోని నీలగిరి హిల్స్‌లో ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య సహా మొత్తం 13 మంది దుర్మరణం పాలయ్యారు. హెలికాఫ్టర్‌లో మొత్తం 14 మంది ప్రయాణిస్తుండగా ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన పేరు వరుణ్ సింగ్. గ్రూప్ కెప్టెన్‌గా ఉన్న వరుణ్ సింగ్ వెల్లింగ్‌టన్‌లోని మిలటరీ హాస్పిటల్‌లో మృత్యువుతో పోరాడుతున్నారు. ఆయన కోలుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. వరుణ్ సింగ్ గురించి చెప్పుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఆయన సంవత్సరం క్రితం కూడా ఇలాంటి ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు.
ఆయన నడుపుతున్న Light Comabat Aircraftలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో.. ఎయిర్‌క్రాఫ్ట్ అదుపు తప్పింది. దాదాపు ఆశలు వదులేసుకున్న పరిస్థితి. అయితే.. ఆయన చాకచక్యంగా వ్యవహరించి అంత్యత ధైర్య సాహసాలను కనబర్చి సురక్షితంగా ఆ విమానాన్ని ల్యాండ్ చేశారు. ఆయన చూపిన ఈ ధైర్య సాహసాలకు గుర్తుగా ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం రోజున వరుణ్ సింగ్‌ను ‘శౌర్య చక్ర’ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఇదిలా ఉండగా.. వరుణ్ సింగ్ మాత్రమే కాదు ఆయన కుటుంబం కూడా త్రివిధ దళాల్లో సేవలందించింది. ఆయన తండ్రి కేపీ సింగ్ కల్నల్‌గా సేవలందించి రిటైర్డ్ అయ్యారు. వరుణ్ సింగ్ సోదరుడు తనూజ్ సింగ్ ఇండియన్ నేవీలో లెఫ్టినెంట్ కమాండర్‌గా సేవలందిస్తున్నారు. వరుణ్ సింగ్ తొలుత బెంగళూరులో ఐఏఎఫ్ టెస్ట్ పైలట్‌గా వ్యవహరించారు. వరుణ్ సింగ్ ప్రస్తుతం వెల్లింగ్‌టన్‌లోని స్టాఫ్ కాలేజ్‌లో ఇన్‌స్ట్రక్టర్‌గా పోస్టింగ్‌లో ఉన్నారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడిన వరుణ్ సింగ్ పరిస్థితి విషమంగా ఉంది.
ఆయనను వెల్లింగ్‌టన్‌లోని మిలటరీ హాస్పిటల్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. చెన్నై నుంచి స్పెషలిస్ట్ డాక్టర్ అక్కడకు చేరుకుని ఆయనకు వైద్యం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. వరుణ్ సింగ్‌ను సర్జరీ నిమిత్తం తీసుకెళుతున్న సందర్భంలో తన భార్యతో మాట్లాడాలని ఆయన కోరినట్లు తెలిసింది. వరుణ్ సింగ్ తండ్రి కల్నల్ కేపీ సింగ్, ఆయన భార్య ఉత్తరప్రదేశ్ ఘాజీపూర్‌కు చెందిన వారు కాగా ప్రస్తుతం భోపాల్‌లో స్థిరపడ్డారు. హెలికాఫ్టర్ దుర్ఘటన జరిగిన సమయంలో వారు ముంబైలో ఉన్న వరుణ్ సింగ్ సోదరుడి నివాసంలో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన వెల్లింగ్‌టన్‌కు బయల్దేరి వెళ్లారు. ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ బిపిన్ రావత్ భార్య మధులిక రావత్ కూడా మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తే కావడం గమనార్హం. ఆమె స్వస్థలం సోహగ్‌పూర్. ఆమె తండ్రి మ్రిగేంద్ర సింగ్ కోట్మ నియోజకవర్గం నుంచి 1972లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఆమె సోదరుడు వెంటనే ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Army, Bipin Rawat, Helicopter, Helicopter Crash, Tamilnadu