గ్రనేడ్ పేలుడు ఘటనతో పఠాన్‌కోట్ లోని ఆర్మీ బేస్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పంజాబ్ లో పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండే పఠాన్‌కోట్ ఆర్మీ క్యాంపు వద్ద సోమవారం తెల్లవారుజామున గ్రనేడ్ పేలుడు చోటుచేసుకుంది. పఠాన్‌కోట్‌లోని ధీర్‌పుల్ ఏరియాలో గల ఆర్మీ క్యాంప్ త్రివేణి గేటు వద్ద ఈ ఘటన జరిగింది. గత అనుభవాల దృష్ట్యా ఇవాళ్టి పేలుడు తర్వాత క్యాంప్ మొత్తం అలెర్టయింది. అయితే, గ్రనేడ్ పేలుడు ఆర్మీ గేటుకు సమీపంగా సివిలియన్ ఏరియా పరిధిలో జరగడంతో ఈ వ్యవహారాన్ని పంజాబ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పఠాన్‌కోట్‌లోని ధీర్‌పుల్ ఏరియాలోని ఇండియన్ ఆర్మీ క్యాంప్ సమీపంలో గ్రనేడ్ పేలుడు తర్వాత అన్ని పోలీస్ చెక్ పోస్టుల వద్ద హైఅలర్ట్ ప్రకటించారు. పెళ్లి ఊరేగింపు ఒకటి ఆ ప్రాంతం నుంచి వెళ్తున్న సమయంలో బైకుపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు గ్రనేడ్ విసిరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడినట్టు సమాచారం అందలేదు. ఘటనా స్థలి నుంచి గ్రెనేడ్ అవశేషాలను స్థానిక పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆర్మీ క్యాంప్ గేటుకు సమీపంలో గ్రనేడ్ విసిరిన దుండగుల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని, ఘటనపై తదుపరి దర్యాప్తు సాగిస్తున్నట్టు పఠాన్‌కోట్ ఎస్ఎస్పీ సురేంద్ర లంబా మీడియాకు తెలిపారు. సరిగ్గా ఆరేళ్ల కిందట పఠాన్‌కోట్ లోని ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు భీకరదాడికి పాల్పడటం, మూడు రోజుల హోరాహోరీ కాల్పుల తర్వాత ఆరుగురు ఉగ్రవాదులను మన బలగాలు మట్టుపెట్టడం, నాటి ఘటనలో ఏడుగురు సిబ్బంది అమరులుకావడం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Attack, BLAST, Indian Army, Punjab