GOVT SERVANTS SHOULD NOT USE MOBILES FOR PERSONAL WORK DURING OFFICE HOURS MADRAS HIGH COURT DIRECTS TAMIL NADU GOVT MKS
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. ఆఫీసులో మొబైల్ ఫోన్లు వాడొద్దన్న హైకోర్టు
ప్రతీకాత్మక చిత్రం
ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఆఫీసు పనివేళల్లో వ్యక్తిగత అవసరాల కోసం మొబైల్ ఫోన్లు వాడొద్దని, ఈ మేరకు నిబంధనలను వెంటనే అమల్లోకి తేవాలని మద్రాస్ హైకోర్టు.. తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలివే..
గవర్నమెంట్ సర్వెంట్లు కార్యాలయాల్లో ప్రజల కోసం పనులు చేయాల్సిన పనుల్ని పక్కన పెట్టేసి సెల్ ఫోన్లతో టైమ్ పాస్ చేయడం ఇకపై కుదరదు. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఆఫీసు పనివేళల్లో వ్యక్తిగత అవసరాల కోసం మొబైల్ ఫోన్లు వాడొద్దని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు షాకిస్తూ ఈ నిబంధనలను వెంటనే అమల్లోకి తేవాలంటూ స్టాలిన్ సర్కారును హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా న్యాయస్థానం పేర్కొంది..
ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగి మొబైల్ ఫోన్ వడటం వల్ల తలెత్తిన ఓ వివాదానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు ఆఫీసుల్లో ఫోన్లు వాడకుండా ఉండేలా విధివిధానాలను రూపొందించాలని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఎస్ఎం సుబ్రమణియమ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అసలీ ఆదేశాలు ఎందుకు జారీ అయ్యాయంటే..
తిరుచిరాపల్లిలోని హెల్త్ రీజనల్ వర్క్‌షాప్ విభాగంలో సూపరిండెంట్‌గా పనిచేస్తోన్న ఓ వ్యక్తి.. ఇటీవల ఆఫీసులో తోటి ఉద్యోగుల వీడియోలు తీశాడు. వద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా తన తీరు మార్చుకోకపోవడంతో ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. దీంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. అతడి పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు.. ప్రభుత్వ సిబ్బంది ఆఫీసుల్లో తరచూ మొబైల్ వినియోగిస్తుండటంపై అసహనం వ్యక్తం చేసింది.
''ఆఫీసుల్లో మొబైల్ ఫోన్లు వినియోగిస్తుండటం, ఫోన్లలో వీడియోలు తీయడం ఇటీవల తరచుగా జరుగుతున్నాయి. ఇవన్నీ తోటి ఉద్యోగులకు అసౌకర్యాన్ని కలిగించడమే గాక, ప్రభుత్వ ఆఫీసుల్లో కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నాయి. అందువల్ల ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది, ఉద్యోగులు కనీస క్రమశిక్షణ పాటించాలి. మొబైల్ ఫోన్లను వీలైతే స్విఛాఫ్ చేయాలి. లేదా వైబ్రేషన్/సైలెంట్ మోడ్‌లో పెట్టాలి. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ మాట్లాడాల్సి వస్తే పై అధికారుల అనుమతి తీసుకుని ఆఫీస్ నుంచి బయటకు వెళ్లి మాట్లాడి రావాలి'' అని హైకోర్టు స్పష్టం చేసింది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.