Tweets block: కోవిడ్ పై ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్ లను తొలగించండి.. నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం.. అందులో రేవంత్ రెడ్డి ట్వీట్ కూడా..

ట్విట్టర్ లోగో

Tweets block: కోవిడ్ పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్ చేసిన వారి ట్వీట్ లను బ్లాక్ చేయాలని ప్రభుత్వం ట్విట్టర్ కు సూచించింది. ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో దానిని పాక్షికంగా ఆమోదిస్తున్నట్లు ట్విట్టర్ తెలిపింది.

  • Share this:
    కోవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తి వేగంగా ఉండటంతో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. దానిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తోంది. కానీ కొంతమంది ప్రముఖులు కరోనా నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను తప్పు పడుతున్నారు. దానికి సంబంధించి ట్విట్టర్ లో ట్వీట్ చేస్తున్నారు. ఏప్రిల్ 22 - 23 మధ్య విపరీతంగా వచ్చిన ట్వీట్స్ పై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ప్రభుత్వ నోటీసుకు స్పందించిన ట్విటర్ పాక్షికంగా చర్యలు తీసుకుంది. మరీ విమర్శనాత్మకంగా ఉన్న వాటిని బ్లాక్ చేసింది. చాలా ట్వీట్లను నిలిపివేసింది. ప్రభుత్వ తీరును విమర్శిస్తూ ట్వీట్స్ చేసినవారిలో పలువురు ఎంపీలు, ఫిల్మ్ మేకర్లు, స్టార్స్ కూడా ఉన్నారు. తెలంగాణ ఎంపీ రేవంత్ రెడ్డి, బెంగాల్ మంత్రి మోలాయ్ ఘటక్, నటుడు వినీత్ కుమార్ సింగ్, ఫిల్మ్ మేకర్లు వినోద్ కాప్రి, అవినాష్ దాస్ లు ఉన్నారు.

    వారు చేసిన ట్వీట్స్ భారత ప్రభుత్వ ఐటీ చట్టాలకు అనుగుణంగా లేవని.. చట్టాలను అతిక్రమించేవిగా ఉన్న కారణంగా వాటిని బ్లాక్ చేయాలని నోటీసులో పేర్కొంది. కోవిడ్ వ్యాప్తికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని.. సర్కార్ కు ముందుచూపు లేని కారణంగానే చాలా మంది కోవిడ్ బారిన పడి చనిపోతున్నారని ప్రభుత్వాన్ని వారు ట్విట్టర్ లో దుయ్యబట్టారు. వారు చేసిన ట్వీట్ లలో ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి ఇంతగా ప్రబలంగా ఉన్నా హరిద్వార్ లో మహా కుంభ్ మేళాకు ప్రభుత్వం అనుమతులిచ్చిందని.. ముందు జాగ్రత్త చర్యలేవీ తీసుకోలేదని వారు పేర్కొన్నారు.

    అందువల్లనే కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయని అందులో పేర్కొన్నారు. అంతే కాకుండా బెడ్స్, ఆక్సిజన్ , మందుల కొరత ఉండటానికి కారణం ప్రభుత్వ వైఫల్యమే అని కూడా ట్వీట్ చేయడంతో ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. అదువల్లేనే ప్రభుత్వం నోటీసు జారీ చేసినట్లు తెలిపింది. అంతకు ముందు కూడా ఇలాగే రైతులు ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో చాలా మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. అప్పుడు కూడా వాటిని తొలగించాలని ప్రభుత్వం ట్విటర్ కు సూచించడంతో వాటిని తొలగించింది.
    Published by:Veera Babu
    First published: