మున్సిపాలిటీల్లో పని చేస్తున్న సాధారణ, కాంట్రాక్టు వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. అందరికీ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ) కార్పొరేషన్ పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర కార్మిక, ఉద్యోగకల్పన శాఖ మంత్రి సంతోశ్ కుమార్ గంగ్వార్ వెల్లడించారు. దీంతో తాత్కాలిక ఉద్యోగులకు సైతం చికిత్స, ఈఎస్ఐ ప్రయోజనాలు దక్కనున్నాయి.
మున్సిపల్ వర్కర్కలకు ఈఎస్ఐ వర్తింపు విషయంలో వేగంగా ముందడుగేయాలని ఈఎస్ఐ కార్పొరేషన్ ను మంత్రి ఆదేశించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీల్లో పని చేస్తున్న సాధారణ, కాంట్రాక్టు ఉద్యోగులను ఈఎస్ఐ కిందికి తీసుకురావాలని ఆదేశించారు. ఇందుకు గాను కేంద్ర కార్మిక శాఖ నోటిఫికేషన్ను జారీ చేసింది.
“మున్సిపల్ కార్పొరేషన్లు, కౌన్సిళ్లలో పని చేస్తున్న సాధారణ, కాంట్రాక్టు వర్కర్లను ఈఎస్ఐ చట్టం కిందికి తెచ్చేలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలను సంప్రదించి చర్యలు తీసుకోవాలని ESICను ఆదేశించాం. ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్న వారిలో మున్సిపల్ వర్కర్లు కూడా ఉన్నారు. అందుకే కాంట్రాక్టు, సాధారణ ఉద్యోగులకు కూడా సామాజిక భద్రత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. మున్సిపల్ రంగంలో పని చేస్తున్న కార్మికులు, వారి కుటుంబాలకు ఈ నిర్ణయం భరోసాను ఇస్తుంది” అని కేంద్ర మంత్రి సంతోశ్ కుమార్ చెప్పారు.
“ఈఎస్ఐ కవరేజీపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే సాధారణ, కాంట్రాక్టు వర్కర్లందరికీ ఈఎస్ఐ పరిధిలోని అన్ని సదుపాయాలు లభిస్తాయి. అనారోగ్యానికి చికిత్స, మాతృత్వ సదుపాయాలు, డిసేబుల్మెంట్ బెనిఫిట్స్ తదితర సదుపాయాలు అన్నీ వారికి వర్తిస్తాయి. అలాగే ఈఎస్ఐ పరిధిలోని అన్ని ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో వారు చికిత్స పొందవచ్చు” అని కార్మిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఈఎస్ఐకు చెందిన 160 ఆసుపత్రులు ఉండగా.. 1500 డిస్పెన్సరీలు ఉన్నాయి.
సామాజిక భద్రత కింద.. తాత్కాలిక ఉద్యోగులకు కూడా ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలని ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు గతేడాది పార్లమెంట్లో ఆమోదం లభించింది. దీంతో ఈ చట్టం కింద మున్సిపల్ క్యాజువల్, కాంట్రాక్టు వర్కర్లను ఈఎస్ఐ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వేగంగా చర్యలు చేపట్టింది. కాగా మున్సిపాలిటీల్లో రెగ్యులర్ ఉద్యోగులకు ఇప్పటికే అన్ని సదుపాయాలు దక్కుతున్న సంగతి తెలిసిందే.
మరోవైపు తమకు ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలని మున్సిపల్ కార్మికులు చేస్తున్న డిమాండ్ ఇప్పుడు నెరవేరినట్టయింది. రాష్ట్ర ప్రభుత్వాలతో ఎసిక్ సంప్రదింపులు ముగిసిన వెంటనే కాంట్రాక్టు, సాధారణ వర్కర్లకు ఇక ఈఎస్ఐ వర్తించనుంది. మరోవైపు కరోనా క్లిష్ట సమయాల్లోనూ నిరంతరాయంగా సేవలు అందిస్తున్న మున్సిపల్ కార్మికులకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ESI, ESIC, Municipal Corporations, Municipal Workers