రైతులకు శుభవార్త.. మిరప పంటకు పురుగు మందును ఇక వాడనవసరం ఉండకపోవచ్చు..!

ప్రతీకాత్మక చిత్రం

రైతుల కష్టాలను తీర్చేందుకు కొందరు శాస్త్రవేత్తలు వినూత్న ప్రయత్నాలను చేస్తున్నారు. ప్రత్యేకించి మిరపసాగులో రైతులకు మేలు జరిగేలా, పెట్టుబడి వ్యయం తగ్గేలా బెంగళూరులోని ఐసీఏఆర్ భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఓ కీలక పరిశోధన చేస్తోంది.

 • Share this:
  కాయాకష్టం చేసి, రేయింబవళ్లు పొలాల్లో గడిపిన రైతుకే అన్నం విలువ తెలుస్తుంది. ఓ ముద్ద బువ్వను పారేయాలంటేనే ఆ రైతుకు మనసొప్పదు. హోటళ్లలోనో, ఫంక్షన్లలోనో వృథాగా పడేస్తున్న ఆహార పదార్థాలను చూస్తే రైతు మనసు చివుక్కుమంటుంది. వేలకు వేలు పెట్టుబడి పెట్టి, క్రిమికీటకాల నుంచి రక్షించుకుని పంటను మార్కెట్లోకి తీసుకొస్తే దానికి వచ్చే కనీస మద్దతు ధరను చూసి రైతు గుండెలు పగులుతాయి. ఆ పంటను అమ్మగా వచ్చిన డబ్బుతో అప్పులన్నీ తీరకపోగా, మళ్లీ పెట్టుబడి కోసం అప్పును చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే రైతుల కష్టాలను తీర్చేందుకు కొందరు శాస్త్రవేత్తలు వినూత్న ప్రయత్నాలను చేస్తున్నారు. ప్రత్యేకించి మిరపసాగులో రైతులకు మేలు జరిగేలా, పెట్టుబడి వ్యయం తగ్గేలా బెంగళూరులోని ఐసీఏఆర్ భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఓ కీలక పరిశోధన చేస్తోంది.

  ఆర్కా తేజస్వి, ఆర్కా తన్వీ, ఆర్కా శాన్వి, ఆర్కా యశశ్వి, ఆర్కా గగన్.. ఏంటీ ఇవేం పేర్లనుకుంటున్నారా? అన్నీ అనుకున్నట్టు జరిగితే మార్కెట్లోకి రాబోయే కొత్త రకం మిరప విత్తనాల పేర్లు ఇవి. క్రిమికీటకాల నుంచి తమను తాము రక్షించుకునేలా, వాటి దాడిని తట్టుకునేలా ఈ వంగడాలు ఉండేట్టుగా శాస్త్రవేత్తలు సృష్టించబోతున్నారు. దీని వల్ల రైతులు పురుగు మందుల కోసం వాడే వ్యయం భారీగా తగ్గిపోతుంది. అదే సమయంలో పెట్టుబడి ఖర్చులు కూడా 40 నుంచి 50 శాతం మేరకు తగ్గిపోతాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఆ వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఖంభం మాధవీ రెడ్డి వెల్లడించారు. వైరస్ లను తట్టుకుని, తనంతట తాను ఏపుగా ఎదిగేలా కొత్త రకం విత్తనాలను శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారన్నారు.

  క్రిమి సంహారక మందుల వినియోగాన్ని తగ్గించడమే కాకుండా, మందుల వినియోగం లేని ఉత్పత్తులను జనబాహుళ్యంలోకి తీసుకురావడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని మాధవీ రెడ్డి వెల్లడించారు. భారత్ లో ప్రతీ ఏటా దాదాపు 6000 కోట్ల మిరప వ్యాపారం జరుగుతోందన్నారు. రైతులకు మేలు చేసే ఈ నూతన వంగడాలను అతి త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్న నమ్మకం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
  Published by:Hasaan Kandula
  First published: