Gold paan: సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడ ఏది జరిగినా ప్రపంచమంతా తెలిసిపోతోంది. తాము పాపులర్ కావాలని భావించిన వారు మిగిలిన వారికంటే భిన్నంగా ఏదో ఒకటి చేస్తుంటారు. అలాగే అందరికీ భిన్నమైన పాన్ని తయారుచేసింది ఢిల్లీకి చెందిన ఈ సంస్థ. సాధారణంగా పాన్ అంటే ఆకు, వక్క, సున్నం ఉంటాయని మనకు తెలుసు. ఇటీవల చాలామంది ఇందులో టూటీఫ్రూటీ, పండ్లముక్కల వంటివి కూడా చేర్చుతున్నారు. అయితే ఢిల్లీలోని కన్నాట్ ప్రాంతంలోని యము పంచాయత్ షాప్ సరికొత్తగా బంగారు పాన్ తయారుచేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలుస్తోంది. ఆ షాప్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిన రఫెల్లో గోల్డ్ పాన్ తయారీ నెటిజన్లు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంటర్నెట్లో వైరల్‌గా కూడా మారింది.
ఈ వీడియోలో ఓ మహిళ పాన్ తయారుచేస్తూ దాని గురించి పూర్తిగా వివరించింది. ముందుగా తమలపాకు తీసుకొని అందులోని క్లోరోఫిల్ వల్ల మన శరీరానికి ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో చెప్పింది. ఆ తర్వాత దాన్ని కట్ చేసి దానికి సున్నం, చట్నీ, ఖుష్బూ చేర్చింది. ఇవి కేవలం రుచి కోసమే కాదనీ... ఇవి గొంతును మాయిశ్చరైజ్ చేస్తాయి కాబట్టి సీజనల్ ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచేందుకు ఈ పాన్ తోడ్పడుతుందని తెలిపింది. ఆ తర్వాత పాన్‌లో డ్రై డేట్స్, డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి, సోంపు గింజలు వంటివన్నీ చేర్చింది. ఆ తర్వాత డ్రైఫ్రూట్స్ వేసి తయారుచేసిన గుల్ కంద్ని చేర్చింది. ఇది శరీరానికి చాలా చలువ చేస్తుందని కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఆ తర్వాత రఫెల్లో చాక్లెట్ (వైట్ చాక్లెట్)ని అందులో చేర్చి పాన్ని మడత పెట్టింది. ఆఖరున మడతపెట్టిన ఈ పాన్ మీద బంగారం ఫాయిల్‌తో అద్దింది. ఆ తర్వాత చెర్రీ, రఫెల్లో చాక్లెట్‌తో దీన్ని గార్నిష్ చేసి అందించింది. పాన్ తయారీ కొత్తగా ఉండడంతో పాటు తయారుచేసేటప్పుడు ఉపయోగించే ప్రతి పదార్థం ఎందుకు వాడుతున్నామో.. దాని వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో చెబుతూ ఆ మహిళ దాన్ని తయారుచేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాన్ ధర కేవలం రూ.600 మాత్రమే అని చెబుతున్నారు షాపు వారు. వీడియో మీరూ చూడండి.
వైరల్ గా మారిన ఈ పాన్ వీడియోకి నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంతమంది ఇది తమకు నచ్చిందని, ఇది చాలా బాగా తయారుచేశారని ఆశ్చర్యపోతుంటే మరికొందరు దీని తయారీతో పోల్చుకుంటే ధర చాలా ఎక్కువగా ఉందని, అందులో చాలా ముఖ్యమైన కొన్ని పదార్థాలను చేర్చడం మర్చిపోయారని కామెంట్లు చేస్తున్నారు. "మంచి క్వాలిటీ పాన్ కావాలంటే 100 నుంచి 150 రూపాయల మధ్యలో వచ్చేస్తుంది. ఇందులో అన్నీ వేయకపోయినా ధర మాత్రం రూ.600. ఈ ధర చాలా ఎక్కువ అనిపిస్తోంది" అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. "పాన్‌లో ముఖ్యమైన కాసు, వక్క లాంటివి పెట్టనే లేదు" అని మరో వ్యక్తి.. "పాన్ వాలా దగ్గరికి వెళ్లి ఇవి, ఇవి వేయండి అని చెబితే వాడు దీనికంటే బాగా చేస్తాడు. అది కూడా చాలా తక్కువ ధరకి" అంటూ మరో వ్యక్తి కామెంట్లు చేశారు.
ఇది కూడా చదవండి: Eggplant: అధిక బరువుకి చెక్ పెట్టి... బాడీలో రక్తాన్ని పెంచే వంకాయలు... ఇలా తినండి
"ఆమె చెప్పే విధానానికి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను" అని ఒకరు, "అద్భుతంగా ఉంది" అని మరో వ్యక్తి పాజిటివ్‌గా కూడా కామెంట్లు చేశారు.