అమ్మాయిలకు రాత్రిపూట బీచ్‌లో ఏం పని? మైనర్ల రేప్‌ కేసుపై సీఎం సంచలన వ్యాఖ్యలు

గోవా సీఎం ప్రమోద్ సావంత్

మైనర్ బాలికలకు రాత్రి పూట బీచ్‌ల్లో ఏం పని? అని సీఎం ప్రమోద్ సావంత్ ప్రశ్నించారు. టీనేజీ అమ్మాయిలున్న తల్లిదండ్రుపై వారిపై ఓ కన్నేసి ఉంచాలని.. రాత్రిపూట బీచ్ పార్టీలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

  • Share this:
    గోవాలో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం కేసులు దుమారం రేపుతోంది. ఈ ఘటనలపై విపక్షాలు భగ్గుమన్నాయి. బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. గోవాలో శాంతిభద్రతలు లేవని.. మహిళలకు రక్షణ లేకుండా పోతోందని  దుమ్మెత్తిపోస్తున్నాయి. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. మైనర్ బాలికలపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో ఈ ఘటనలపై అసెంబ్లీలో సీఎం ప్రమోద్ సావంత్ స్పందించారు. ఈ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మైనర్ బాలికలకు రాత్రి పూట బీచ్‌ల్లో ఏం పని? అని ఆయన ప్రశ్నించారు. టీనేజీ అమ్మాయిలున్న తల్లిదండ్రులు తాన పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని.. రాత్రిపూట బీచ్ పార్టీలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

    '' 10 మంది పిల్లలు బీచ్‌లో పార్టీ చేసుకునేందుకు వెళ్లారు. ఆ పది మందిలో ఆరుగురు తిరిగి ఇంటికి చేరుకున్నారు. కానీ ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు మాత్రం రాత్రంతా బీచ్‌లోనే గడిపారు. అర్ధరాత్రి పూట బీచ్‌లోనే ఉండాల్సిన అవసరమేంటి? 14 ఏళ్ల అమ్మాయి రాత్రి పూట బీచ్‌కు వెళ్తుంటే తల్లిదండ్రులు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. వాళ్లు కూడా పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులు మాట వినడం లేదని ఆ బాధ్యతను పోలీసుల‌కు వదిలేయడం కరెక్టు కాదు.'' అని సీఎం ప్రమోద్ సావంత్ అసెంబ్లీలో అన్నారు.

    కాగా, జులై 24న సౌత్ గోవాలోని కోల్వా బీచ్‌లో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగింది. మహిళా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఈ క్రమంలోనే మైనర్‌లపై రేప్ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేశారు. రేప్ కేసుతో సంబంధమున్న అసిఫ్ హతేలి (21), రాజేశ్ మానే (33), గజానంద్ చించంకర్ (31), నితిన్ యబ్బల్ (19) అనే యువకులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఐతే అమ్మాయిల విషయంలో సీఎం ప్రమోద్ సావంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన తీరుపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. గోవాలో అర్ధరాత్రి పూట స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు ఉండాలని.. అది గోవా బ్రాండ్ ఇమేజ్ అని స్పష్టం చేస్తున్నారు. అర్ధరాత్రి తిరిగినా ఏం కాదనే భరోసా ఇవ్వాలి తప్ప.. బాధితులను నిందించడం కరెక్టు కాదని విమర్శిస్తున్నారు. సీఎం స్థాయిలో ఉండి అలా మాట్లాడడం సిగ్గు చేటని దుమ్మెత్తిపోస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: