లిక్కర్ స్కామ్(DelhiLiquor scam)లో అరెస్ట్‌యిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా(Manish sisodia)కు సుప్రీంకోర్టు(Supreme court)లోనూ షాక్ తగిలింది. సీబీఐ(CBI) తనను అరెస్ట్ చేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన సిసోడియా పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. సుప్రీంకోర్టు నేరుగా జోక్యం చేసుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న సీజేఐ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ఇక సీసోడియా తరఫున అభిషేక్ సింఘ్వి వాదనాలు వినిపించారు. సిసోడియా అరెస్ట్ అక్రమమని సింఘ్వి వాదించారు. సిసోడియా ఎక్కడకు పారిపోవడం లేదని కోర్టుకు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వంలో 18పోర్ట్‌ఫోలియోలు సిసోడియాకు ఉన్నయన్న విషయన్ని సింఘ్వి సుప్రీంకోర్టుకు చెప్పారు. అయితే ఢిల్లీ హైకోర్టుకు ఎందుకు వెళ్లకూడదని సింఘ్విని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీంతో రేపు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో సిసోడియా లాయర్ ఉన్నట్లు తెలుస్తోంది.
నిన్న అవెన్యూ కోర్టులో.. ఇప్పుడు సుప్రీంలో:-
ఢిల్లీ ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవకతవకల వ్యవహారంపై దర్యాప్తులో భాగంగా ఆదివారం సాయంత్రం సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. నిన్న ఆయన్ను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. దర్యాప్తు సమయంలో పొంతనలేని సమాధానాలు చెప్పారని, తమ వద్ద ఉన్న ఆధారాలకు ఆయన చెబుతున్న సమాధానాలకు సరిపోలడం లేదని సీబీఐ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మద్యం విధానం కోసం రూపొందించిన ముసాయిదా నోటీసుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాలను సిసోడియా తొలగించారని ఆరోపించారు. తమ ప్రశ్నలకు దాటవేత ధోరణిలో సమాధానాలు ఇస్తున్నారని తెలిపారు. ఈ కేసు దర్యాప్తు ముందుకెళ్లాలంటే ఆయన్ను ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని కోరగా.. కోర్టు అందుకు అంగీకరించింది.
ఢిల్లీ బడ్జెట్ ప్రవేశపెట్టేదెవరు.?
ఢిల్లీ కేబినేట్(Cabinet) లో కీలక శాఖలకు మంత్రులుగా ఉన్న సత్యేందర్ జైన్, మనీశ్ సిసోడియాలు అరెస్టు కావడంతో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. సిసోడియా ఆరోగ్యం, విద్య , పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, సర్వీసెస్, ఫైనాన్స్, పవర్, హోమ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌తో సహా 18 శాఖలను చూస్తున్నారు. ప్రత్యేకంగా ఏ మంత్రికి కేటాయించని శాఖలన్నింటిని కూడా ఆయనే నిర్వహిస్తున్నారు. కేబినేట్‌లో సిసోడియా గైర్హాజరు అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal)కు తీరని లోటుగా మారింది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం సిసోడియాను భర్తీ చేయడం కేజ్రీవాల్‌కు తక్షణ సవాలుగా మారింది. ఇక రానున్న బడ్ట్‌ట్‌ను ఎవరు ప్రవేశపెడతారనే విషయం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఢిల్లీ ప్రభుత్వ బడ్జెట్‌ను రెవెన్యూ మంత్రి కైలాష్ గహ్లోట్ సమర్పించే అవకాశం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చాయి. గహ్లోట్ గత కొన్ని రోజులుగా బడ్జెట్ సంబంధిత సమావేశాలకు హాజరవుతుండడంతో ఇదే ఖరారవనున్నట్టు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CBI, Delhi High Court, Delhi liquor Scam, Supreme Court