ఎన్‌ఆర్సీ, పౌరసత్వ చట్టంపై బీజేపీకి మమతా బెనర్జీ సవాల్

బీజేపీకి దమ్ముంటే ఐక్యరాజ్యసమితి సమక్షంలో పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్‌సీ మీద రెఫరెండం నిర్వహించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: December 19, 2019, 8:25 PM IST
ఎన్‌ఆర్సీ, పౌరసత్వ చట్టంపై బీజేపీకి మమతా బెనర్జీ సవాల్
మమతా బెనర్జీ
  • Share this:
దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్ఆర్‌సీ మీద కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సవాల్ విసిరారు. సీఏఏ, ఎన్ఆర్‌సీని వ్యతిరేకిస్తూ కోల్‌కతాలో మమతా బెనర్జీ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడారు. ‘మెజారిటీ ఉంది కదా అని బీజేపీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదు. బీజేపీకి దమ్ముంటే ఐక్యరాజ్యసమితి సమక్షంలో పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్‌సీ మీద రెఫరెండం నిర్వహించాలి. ఐక్యరాజ్య సమితి కాకపోతే మానవహక్కుల కమిషన్‌తో నిష్పాక్షికంగా ఆ రెఫరెండం నిర్వహించాలి. ఒకవేళ ఎన్ఆర్‌సీ, సీఏఏకి వ్యతిరేకంగా ప్రజలు ఓటేస్తే బీజేపీ ప్రభుత్వం నుంచి దిగిపోవాలి. ’ అని మమతా బెనర్జీ సవాల్ చేశారు.

రేపు పార్క్ సర్కస్‌లో నిరసన చేపడుతున్నామని, ప్రజలు అందరూ సంయమనంతో వ్యవహరించాలని మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు. బీజేపీ ట్రాప్‌లో పడొద్దని విజ్ఞప్తి చేశారు. ‘ఎవరూ బీజేపీ ట్రాప్‌లో పడొద్దు. దీన్ని హిందు - ముస్లింల మధ్య ఫైట్‌గా మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఓ వర్గం మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగా కొందరు బీజేపీ కార్యకర్తలు ముసుగులు ధరించి విధ్వంసానికి పాల్పడుతున్నారని మాకు విశ్వసనీయమైన సమాచారం ఉంది.’ అని మమతా బెనర్జీ ఆరోపించారు.


అయితే, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యను వెనక్కు తీసుకోవాలని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్ డిమాండ్ చేశారు. ‘కేంద్రం తెచ్చిన సీఏఏ, ఎన్ఆర్‌సీ మీద ఐరాస సమక్షంలో నిష్పాక్షిక రెఫరెండం నిర్వహించాలని మమత చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి.’ అని జగదీప్ ధన్‌కర్ ట్వీట్ చేశారు.
First published: December 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు