దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరుద్యోగం పెరిగిపోతోంది. కరోనా ప్రభావంతో నిరుద్యోగం మరింతగా ఎక్కువైంది. పరిస్థితి ఇప్పుడిప్పుడే కాస్త మెరుగవుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. అయితే కొందరు యువకులు మాత్రం ప్రభుత్వ ఉద్యోగాల మీదే ఎక్కువ ఆశలు పెట్టుకుని.. వాటి కోసం ఏళ్లపాటు ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి ఓ యువకుడు ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాసి వింత కోరిక కోరడం చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్రంలోని వసిం ప్రాంతానికి చెందిన గజానన్ రాథోడ్ అనే 35 ఏళ్ల యువకుడు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు రాసిన ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తనకు ఉద్యోగం(ప్రభుత్వ ఉద్యోగం) ఇవ్వాలని లేకపోతే పిల్లను చూసి పెళ్లి చేయాలని అతడు లేఖలో కోరాడు. తనకు 35 ఏళ్ల వయసు ఉందని.. గత ఏడేళ్లుగా తాను ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్షలు రాస్తున్నానని లేఖలో పేర్కొన్నాడు. అయితే తనకు ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను పెళ్లిచూపులకు వెళ్లినప్పుడల్లా అక్కడి వాళ్లు ప్రభుత్వ ఉద్యోగం ఉందా అని ప్రశ్నిస్తున్నారని లేఖలో తెలిపాడు.
అయితే ప్రభుత్వం కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని.. ఇది తనకు ఇబ్బందిగా మారిందని అన్నాడు. తన లేఖకు సీఎం ఉద్దవ్ ఠాక్రే స్పందించాలని గజనాన్ కోరాడు. ఈ లేఖపై మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోయినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ లేఖ తెగ వైరల్ అవుతోంది. ఉద్యోగాల భర్తీ సరిగ్గా లేకపోవడం కారణంగా నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉందో ఈ లేఖ ద్వారా అర్థమవుతోందని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:January 12, 2021, 16:39 IST