కాంగ్రెస్ పార్టీలో ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం చిచ్చుపెట్టిన విషయం తెలిసిందే. పార్టీ నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ సీనియర్లు సోనియాకు లేఖ రాయడాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టడమే గాక.. బీజేపీతో కుమ్మక్కయ్యారని విమర్శించడంతో దుమారం రేగింది. ఆ తర్వాత ఆయన అలా అనలేదని వివరణ ఇచ్చినప్పటికీ పార్టీలో కోల్ వార్ కొనసాగుతోంది. ఈ క్రమంలో కేంద్రమంత్రి, RPI అధినేత రాందాస్ అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబాల్ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరాలని సూచించారు. కాంగ్రెస్ కోసం ఇద్దరు నేతలు ఎంతో కష్టపడ్డారని.. అలాంటి నేతలను కాంగ్రెస్ హైకమాండ్ విస్మరించిందని అన్నారు. ఇన్నేళ్ల తర్వాత కూడా వారికి పార్టీలో సరైన గౌరవం దక్కడం లేదని అభిప్రాయపడ్డారు అథవాలే.
ఈ నేపథ్యంలో జ్యోతిరాదిత్య సింధియా మాదిరే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరడమే మంచిదని ఆయన సూచించారు. పార్టీ కోసం పనిచేసిన వారిపై నిందలు వేయడం తగదని రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు అథవాలే.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పదవి విషయంలో వివాదం నెలకొంది. ఆజాద్, కపిల్ సిబాల్‌ను రాహుల్ గాంధీ విమర్శించారు. బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్‌కు రాజీనామా చేయాలని ఆ ఇద్దరు నేతలను నేను కోరుతున్నా. కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో ఎన్నో ఏళ్లు పనిచేశారు. ఇప్పుడు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరే సమయం వచ్చింది.
— రాందాస్ అథవాలే
సచిన్ పైలట్ కూడా పార్టీని వీడినప్పటికీ మళ్లీ రాజీ కుదిరిందని చెప్పారు అథవాలే. దేశంలో ప్రస్తుతం బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని.. కులమతాలకతీతంగా ప్రజలు బీజేపీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 350కి పైగా సీట్లు గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు.
కాగా, కాంగ్రెస్‌పార్టీ నాయకత్వ మార్పు విషయంలో సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు పార్టీలోని 23 మంది సీనియర్ నేతలు పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఐతే ఆమె ఆస్పత్రిలో ఉన్న సమయంలో లేఖ ఎందుకు రాశారని సీడబ్ల్యూసీ సమావేశంలో సీనియర్లను నిలదీశారు రాహుల్ గాంధీ. పార్టీలోని సీనియర్ నేతలు బీజేపీతో కుమ్మక్కయ్యారని రాహుల్ గాంధీ ఆరోపించడంతో.. ఆయన వ్యాఖ్యలను ఆజాద్, కపిల్ సిబాల్ మొదట తప్పుబట్టారు. రాహుల్ గాంధీ అలా అనలేదని రణ్‌దీప్ సూర్జేవాల క్లారిటీ ఇవ్వడంతో.. మళ్లీ తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. ఆ గొడవ అక్కడితో సద్దుమణిగిందని పార్టీ నేతలు చెప్పినా.. ఇప్పటికీ పలువురు నేతలు రాహుల్ గాంధీపై గుర్రుగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
Published by:Shiva Kumar Addula
First published:September 02, 2020, 07:53 IST