ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో గ్యాస్ లీకయింది. విష వాయువులు వెలువడి నలుగురు ఉద్యోగులు మరణించారు. మరికొందరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వారిని హుటాహుటిన ఇస్పత్ జనరల్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. కోల్ కెమికల్ డిపార్ట్‌మెంట్‌లో ఉదయం పెద్ద ఎత్తున గ్యాస్ లీకయింది. ఆ సమయంలో డ్యూటీలో 15 మంది సిబ్బంది ఉన్నారు. విష వాయువులను పీల్చి అపస్మాకర స్థితిలోకి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. చెల్లా చెదురుగా పడిపోయిన ఉద్యోగులను ఆస్పత్రికి తరలించారు. ఐతే అప్పటికే ఇద్దరు మరణించగా.. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరో 8 మందికి చికిత్స కొనసాగుతోంది. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
ప్రమాదంపై స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఆరాతీస్తున్నారు. ప్రమాదంలో చనిపోయిన వారంతా కాంట్రాక్ట్ ఉద్యోగులని అధికారులు చెప్పారు. ఘటన దురదృష్టకరమని.. వారి కుటుంబాలను అదుకుంటామని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.