అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి ఆలయ నిర్మాణం జోరుగా సాగుతోంది. ఆ ఆలయంలో బాల రాముడి విగ్రహం రూపకల్పన కోసం నేపాల్ నుంచి ప్రత్యేక శిలలను తెప్పిస్తున్నారు. ఇవి మామూలు శిలలు కావు. వీటిని అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. గండకీ నది చెంత ఈ శిలలు లభిస్తాయి. ఇవి సుమారు 6 కోట్ల సంవత్సరాల నాటివి అని చెబుతారు. ఇలాంటి శిలలతో బాల శ్రీరాముడి విగ్రహం రూపొందించాలని నిర్ణయించారు. ఆ ప్రకారమే.. వాటిని నేపాల్ నుంచి తెప్పిస్తున్నారు.
దేశంలో చాలా మంది దేవుళ్లకు ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. కానీ రాముడికి మాత్రం తాను పుట్టిన చోట ఆలయం లేకపోవడం అనేది రామభక్తులకు ఆవేదన కలిగించే అంశం. అందుకే.. అయోధ్యలో భారీ రామాలయం నిర్మించాలని ఏళ్లుగా కోరుతూనే ఉన్నారు. వారి కల ఈ సంవత్సరం చివరి నాటికి నెరవేరనుంది. రామాలయం ఎంత అందంగా నిర్మిస్తున్నారో... రామజన్మభూమి గర్భాలయంలో ప్రతిష్టించబోయే శ్రీరాముడి విగ్రహం కూడా అంతే అందంగా.. చూడచక్కగా ఉండనుంది. ఈ విగ్రహ తయారీ కోసం... రెండు ప్రత్యేక అరుదైన శిలలను ఎంపిక చేశారు. ఈ శిలలు ఈ గురువారం (02 ఫిబ్రవరి 2023) నాటికి అయోధ్య చేరుకుంటాయి.
ఈ శిలలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు లారీల్లో నేపాల్ నుంచి బయలుదేరుతున్న శిలలను అక్కడి వారు పూజిస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. చాలా మంది శిలలను తాకి.. జన్మధన్యమైనట్లు భావిస్తున్నారు.
ఆ వీడియోని ఇక్కడ చూడండి
The stone of Dev Shila Shaligram, which is going from Pokhara, Nepal to #Ayodhya is being worshiped by the devotees on the way. Jai Shri Ram ???? The idol of Shri Ram will be made from this rock extracted from gandaki river in pokhara, which will be installed in the #Ayodhya temple pic.twitter.com/aLLx2oGnXe
— सुभोध ✍ राष्ट्र सवोर्परि ????????जय हिंद (@AASHRAY90338453) January 28, 2023
తిరుమలలోని శ్రీవారి మూల విరాట్టు కూడా గండకీ నది శిల అనే చెబుతారు. ఐతే.. శ్రీవారి మూల విరాట్టు తిరుమలలో ఎలా వచ్చిందనే అంశంపై చాలా వాదనలు ఉన్నాయి. దీనిపై పురాణ గాథలున్నాయి. గండకీ నది శిలలు చాలా శ్రేష్టమైనవి. అందుకే అయోధ్య బాల రాముడి విషయంలో ఆ శిలలనే ఎంపిక చేసినట్లు తెలిసింది.
ఆ రెండు శిలలలో ఒకటి 14 టన్నుల బరువు ఉంది. మరొకటి 26 టన్నుల బరువు ఉంది. ఇవి 7 అడుగుల ఎత్తు ఉన్నాయి. ఈ శుక్రవారం ఆ శిలలు నేపాల్ నుంచి రెండు లారీలలో బయలుదేరాయి. అవి ఏమాత్రం చెక్కు చెదరకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. వాటిని నెమ్మదిగా తీసుకొస్తున్నారు. అందువల్లే అవి రావడానికి ఎక్కువ టైమ్ పట్టబోతోంది.
అటు అయోధ్య విమానాశ్రయ ప్రాజెక్ట్ పనులు 2023 జూన్ నాటికి పూర్తవుతాయని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఇదివరకు అంచనా వేసింది. ఈ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి ప్రాజెక్ట్ విలువ రూ.242 కోట్లు. ఇందులో టెర్మినల్ భవనం నిర్మాణం, ఎయిర్‌సైడ్ సౌకర్యాల అభివృద్ధి వంటివి కీలకంగా ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్‌లో అడుగడుగునా ఆధ్యాత్మిక భావం కలిగేలా ఉంటుందనీ.. రాకపోకలు సాగించే ప్రయాణికుల్లో భక్తిభావం ఉప్పొంగేలా చేస్తామని అధికారులు తెలిపారు.
2023 డిసెంబర్ నాటికి అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తవుతుంది. ఎయిర్‌పోర్ట్.. రామాలయానికి 7కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎయిర్‌పోర్ట్ నుంచి రామజన్మభూమికి భక్తులు నేరుగా వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా చాలా త్వరగా స్వామివారిని దర్శించుకునేందుకు వీలు కలుగనుంది. దీని ద్వారా ఏడాదికి 6 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు వీలవుతుంది. రద్దీ సమయాల్లో ఒకేసారి 300 మంది ప్రయాణికులకు సేవలందించేలా రూపొందిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ayodhya, Ayodhya Ram Mandir, Uttar pradesh