ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బర్త్ డేను ఈ సారి కొంచెం వెరైటీగా సెలబ్రేట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. సెప్టెంబర్ 17వ తేదీన నరేంద్ర మోదీ 72వ పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ క్రమంలో సహజంగా మోదీ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ఆయన ఆరోగ్యం కోసం పూజలు, హోమాలు చేయడం, భారీ ఎత్తున కేక్ లు కట్ చేయడం లాంటివి చేస్తుంటారు. కానీ, ఈ సారి అందుకు భిన్నంగా నిర్వహించడానికి కమలనాధులు సంకల్పించారు. ఈసారి మోదీ బర్త్ డేకి వెరైటీగా ఉండేందుకు 56 అంగుళాల ఆకుల్లో 56 వెరైటీ వంటకాలతో భోజనాలు, పసి పిల్లలకు బంగారపు ఉంగరాలు లాంటివి పంపిణీ చేయడానికి ప్లాన్ చేశారు. కొన్ని చోట్ల బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లు పెడుతున్నారు. ఏయే రాష్ట్రాల్లో ఎవరెవరు ఎలాంటి ప్లాన్లు చేశారో చూద్దాం.
56 అంగుళాల భోజనం ప్లేట్‌లో 56 వెరైటీ రుచులు
ఢిల్లీలోని కన్నౌట్ ప్లేస్‌లో ఉండే ఆర్డోర్ 2.1 అనే రెస్టారెంట్ మోదీ బర్త్ డే సందర్భంగా ఓ భారీ మీల్స్ తీసుకొచ్చింది. 56 అంగుళాల ప్లేట్‌లో 56 రకాల వంటకాలతో ‘మోదీ థాలీ’ ని భోజన ప్రియులకు అందిస్తోంది. ‘నరేంద్ర మోదీ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన దేశానికే గర్వకారణం. అందుకే ఈ స్పెషల్ థాలీని తీసుకొచ్చాం. మోదీని ఆహ్వానించి మా రెస్టారెంట్‌లో ఈ వంటకాలు రుచి చూపించాలనుకున్నాం. కానీ, పీఎం భద్రతా రీత్యా అది కుదరకపోవచ్చు. అందుకే మోదీ అభిమానుల కోసం మేం ఈ 56 అంగుళాల థాలీని తీసుకొచ్చాం.’ అని రెస్టారెంట్ ఓనర్ సుమిత్ కల్రా తెలిపారు.
మోదీకి వచ్చిన గిఫ్ట్‌లు ఆక్షన్ ద్వారా విక్రయం
నరేంద్ర మోదీకి కామన్ వెల్త్ క్రీడాకారులు అందించిన సుమారు 1200 రకాలైన బహుమతులను వేలం వేయనున్నారు. సెప్టెంబర్ 17న మోదీ పుట్టిన రోజే ఈ వేలం జరగనుంది. ఈ ఆక్షన్ ద్వారా వచ్చిన డబ్బులను నమామి గంగే ప్రాజెక్టు కోసం నరేంద్ర మోదీ అందించనున్నారు. కొన్ని వినాయకుడి ప్రతిమలు, అయోధ్య రామ మందిరం నమూనా ఆలయం, వారణాశిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం నమూనాలు కూడా మోదీకి వచ్చిన బహుమతుల్లో ఉన్నాయని, వాటిని కూడా వేలం వేస్తున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.
Shri @NarendraModi is the first PM to ever decide to auction off all of his gifts!
The money raised from online auction will be used to further the worthy goal of protecting country's lifeblood, the Holy River Ganga.#NamamiGanga#PMMementosAuction2022 has arrived!???? pic.twitter.com/ouKckfcjBm — G Kishan Reddy (@kishanreddybjp) September 16, 2022
బీజేపీ కార్యకర్తల సేవా కార్యక్రమాలు
నరేంద్ర మోదీ బర్త్ డే సందర్భంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ కార్యకర్తలు ప్లాన్ చేశారు. సుమారు 15 రోజుల పాటు అంటే అక్టోబర్ 2న గాంధీ జయంతి వరకు మోదీ బర్త్ డే పక్షోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఢిల్లీ మురికివాడల్లలో ఉండే సుమారు 10,000 మందికి పైగా పిల్లలతో 5కే రన్ లాంటివి నిర్వహించనున్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, హెల్త్ చెకప్ క్యాంప్స్, లాంటివి దేశవ్యాప్తంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
తమిళనాడులో ఏకంగా బంగారు ఉంగరాలు
తమిళనాడు బీజేపీ మోదీ బర్త్ డేను ఘనంగా సెలబ్రేట్ చేయనుంది. నరేంద్ర మోదీ పుట్టిన సెప్టెంబర్ 17వ తేదీనే పుట్టే పిల్లలకు బంగారు ఉంగరాలను బహూకరించనున్నారు. ఒక్కో బంగారు ఉంగరం బరువు 2 గ్రాములు ఉంటుంది. దీని విలువ సుమారు రూ.5000 ఉండొచ్చని అంచనా. చెన్నైలోని RSRM ఆస్పత్రిలో ఒక రోజుకు సుమారు 10 నుంచి 15 కాన్పులు జరుగుతాయి. అలాగే 720 కేజీల ఫిష్‌ను కూడా పేదలకు పంచనున్నారు.
నమో యాప్ ద్వారా మోదీకి గ్రీటింగ్స్ తెలపొచ్చు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బర్త్ డే విషెస్ చెప్పాలనుకునే ఫ్యాన్స్ కోసం నమో యాప్‌లో కొత్త ఫీచర్ తీసుకొచ్చారు. సెప్టెంబర్ 17న మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఆ యాప్ వినియోగిస్తున్న వారు మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు యాప్ ద్వారా తెలియజేయవచ్చు. మీరు సింగల్ గా కానీ, ఫ్యామిలీ అయినా కూడా ఓ మంచి ఫొటో తీసి ఫ్యామిలీ ఈ కార్డ్ ద్వారా అప్ లోడ్ చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Modi, Narendra Modi Birthday, Pm modi, PM Narendra Modi