మన దేశంలో కొన్ని రోజులుగా ఉచిత హామీల (Freebies)పై హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. ఉచిత హామీలను వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీ (PM NarendraModi) చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా రచ్చకు దారితీశాయి. ఉచిత హామీలు దేశాభివృద్ధికి ప్రమాదకరమన్న ప్రధానిపై సీఎం కేసీఆర్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మండిపడ్డారు. పేదలకు ఉచిత వైద్యం, విద్యను అదించడం కూడా తప్పేనా అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Arvind Kejriwal) విమర్శించారు. పేద రైతులను ఆర్థికంగా ఆదుకోకూడదని చెబుతున్నారా? అని సీఎం కేసీఆర్ (CMK KCR) ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. మీలాగే కార్పొరేట్లకు దోచిపెట్టలేమని.. పేద వారికి కష్టమొస్తే తప్పకుండా ఆదుకుంటామని తెగేసి చెప్పారు. ఈ క్రమంలో ఉచితాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (NV Ramana) కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాల అంశం రోజురోజుకీ సంక్లిష్టంగా మారుతోందని.. విద్య, వైద్యం, తాగునీరు వంటి కనీస అవసరాలు కల్పించడాన్ని కూడా ఉచితం అనగలమా? అని ప్రశ్నించారు. అదే సమయంలో ప్రజలు ఉచితాల కోసం చూడడం లేదని..గౌరవప్రదమైన ఆదాయాన్ని వారు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
Farmers: రైతులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.
రాజకీయ పార్టీలు చేసే ఉచిత హామీలను అడ్డుకునేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తూ అడ్డుకొనేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది అశ్వినీకుమార్ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై బుధవారం సీజేఐ జస్టిస్ రమణ, జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ హిమా కొహ్లిల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఉచితాలపై సుప్రీంకోర్టు కీాలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత తాయిలాలు.. అసలైన సంక్షేమ పథకాల మధ్య గందరగోళానికి గురికాకూడదని తెలిపింది. ఓటర్లు ఉచితాల కోసం చూడడం లేదని.. అవకాశమిస్తే గౌరవప్రదంగా ఆదాయాన్ని పొందాలని కోరుకుంటున్నారని స్పష్టంచేసింది. ఐతే అన్నీ ఉచితంగా ఇవ్వడమే సామాజిక సంక్షేమమని అనుకుంటే.. అది అపరిపక్వత కిందకు వస్తుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన జస్టిస్ రమణ... సంక్షేమ కార్యక్రమాలను ఉచిత పథకాల కింద పరిగణించకూడదని స్పష్టం చేశారు. ఆర్టికల్ 33(2) ప్రకారం ఆదాయ అసమానతల తగ్గింపునకు ప్రభుత్వాలు ప్రయత్నించాలని.. ప్రజలందరికీ సమాన అవకాశాలను కల్పించాలని అన్నారు.
రాజకీయ పార్టీలు, వ్యక్తులు హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేమని సీజేఐ స్పష్టం చేశారు. ఉచిత నిర్బంధ విద్య, వైద్యం, తాగునీరు, రైతులకు వ్యవసాయాన్ని గిట్టుబాటుగా మార్చడానికి విద్యుత్, ఎరువులు, విత్తనాలు రాయితీ ధరపై ఇవ్వడాన్ని ఉచితమనగలమా? అని ఈ సందర్భంగా జస్టిస్ రమణ ప్రశ్నించారు. మరోవైపు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వినియోగ వస్తువులను ఉచితంగా ఇవ్వడం, ఉచిత కోచింగ్ తరగతుల నిర్వహణను సంక్షేమం అనవచ్చా? అని ప్రశ్నించారు. గౌరవప్రదమైన ఆదాయం సంపాదించుకోవడానికి అవకాశం ఇవ్వడం ఉచితమవుతుందా? అని ఆయన పేర్కొన్నారు. ఉచితాలపై ఎన్నో రకాల వాదనలు జరుగుతున్నాయని.. ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారని కొందరు విమర్శిస్తుంటే.. ప్రోత్సాహకాలు ఇవ్వడానికి అది అవసరమని మరికొందరు అభిప్రాయపడుతున్నట్లు సీజేఐ తెలిపారు. ఈ నేపథ్యంలో అసలు ఈ విషయాలను విచారించే అధికారం కోర్టుకు ఉందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోందని.. దీనిపై మీ అభిప్రాయాలు చెప్పాలని పార్టీలను కోరారు. కేసు సమర్థించే వారు, వ్యతిరేకించే వారు శనివారం లోపు లిఖితపూర్వకంగా చెప్పాలని ఆదేశించారు. తదుపరి విచారణకు ఆగస్టు 23కు వాయిదా వేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Freebies, NV Ramana, Supreme Court