ఆదివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు యావత్ భారత దేశం సన్నద్ధమవుతోంది. పంద్రాగస్టు సంబరాలను ఘనంగా నిర్వహించుకునేందుకు అందరూ ఏర్పాట్లు చేస్తుకుంటున్నారు. ఇదే అదనుగా భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు స్కెచ్ వేశారు. భారత్‌లో ఉంటున్న ఉగ్రవాదుల ద్వారా పేలుళ్లకు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు కుట్రచేశాయి. జమ్మూకాశ్మీర్‌లో భారీ ఉగ్రకుట్రలను శనివారం భద్రతా దళాలు భగ్నం చేశాయి. నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసి... వారి వద్ద నుంచి భారీ మొత్తంలో బాంబులు, తుపాకులు, మేగజైన్స్ స్వాధీనం చేసుకున్నారు. పుల్వామాకు చెందిన మంతాజిర్ మంజూర్, జహంగీర్ అహ్మద్, షోపియన్‌కు చెందిన తౌసీఫ్ అహ్మద్ షా, యూపీకి చెందిన ఇజహార్ ఖాన్ తమ అదుపులో ఉన్నట్లు తెలిపారు. వీరంతా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నారు. ఆదివారం రోజు దేశవ్యాప్తంగా పలు చోట్ల ఉగ్రదాడులకు పన్నాగం పన్నారని జమ్మూకాశ్మీర్ పోలీసులు వెల్లడించారు.
నిఘా వర్గాల సమాచారంతో మొదట పుల్వామాలోని పిచూ ప్రాంతంలో ముంతాజిర్ మంజూర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి ఒక పిస్టల్, ఎనిమిది రౌండ్ల బుల్లెట్స్, రెండు చైనీస్ హ్యాండ్ గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. కాశ్మీర్ లోయకు ఆయుధాలను తరలించేందుకు ఉపయోగించిన ఓ ట్రక్కును కూడా సీజ్ చేశారు. ఇతడు ఇచ్చిన సమాచారంతో మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. పాకిస్తాన్‌లో ఉండే జైషే కమాండర్ మునాజిర్ ఆదేశాల మేరకు తాము పనిచేస్తున్నామని యూపీకి చెందిన ఇజహార్ ఖాన్.. పోలీసుల విచారణలో వెల్లడించాడు. పాకిస్తాన్ నుంచి డ్రోన్‌ల సాయంతో మారణాయుధులను పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జారవిడుస్తారని.. అక్కడి నుంచి ఆయుధాలను సేకరించే బాధ్యతను తమకు అప్పగించాడని అతడు చెప్పాడు. పాకిస్తాన్ కమాండర్ ఆదేశాల మేరకు పానిపట్‌లోని ఆయిల్ రిఫైనరీలో రెక్కీ కూడా చేశామని.. దానికి సంబంధించిన వీడియోలు కూడా పంపించినట్లు వెల్లడించాడు. అయోధ్యలో సైతం రెక్కీ నిర్వహించాలని పాకిస్తాన్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిపాడు. కానీ ఆ లోపే అరెస్ట్ అయ్యాడు.
J&K Police arrests 4 JeM terrorists
Arrested terrorist, Ijahar Khan was asked by a Pak-based commander to do reconnaissance of Panipat Oil Refinery which he did&sent videos to Pak.He was tasked to do reconnaissance of Ram Temple in Ayodhya but was arrested before it: IGP, Jammu pic.twitter.com/VRDmgpW0IX
— ANI (@ANI) August 14, 2021
షోపియన్‌కు చెందిన మరో ఉగ్రవాది తౌసీఫ్ అహ్మద్ జమ్మూలో ఉంటున్నాడు. ఐఈడీ బాంబును పెట్టేందుకు ఓ బైక్ సమకూర్చడమే ఇతడి డ్యూటీ. పంజాబ్ నుంచి బాంబులను తీసుకొచ్చి పాత బైక్‌కు అమర్చి జమ్మూలో విధ్వంసం సృష్టించాలని కుట్ర చేశారు. పుల్వామాకు చెందిన మరో ఉగ్రవాది జహంగీర్ అహ్మద్ పండ్ల వ్యాపారం చేస్తాడు. పైకి పండ్ల వ్యాపారం చేస్తున్నా.. లోలోపల మాత్రం జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నాడు. స్థానికంగా ఉండే పలువురు యువకులను ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నాడు. ఈ నలుగురు ఉగ్రవాదులు అరెస్ట్ కావడం, వారు ఇచ్చిన సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. జమ్మూకాశ్మీర్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టదిట్టం చేశారు. ఫార్వర్డ్ పోస్ట్‌ల వద్ద నిఘా పెంచారు. పాకిస్తాన్ సరిహద్దు నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలను తరలించే అవకాశం ఉండడంతో.. డ్రోన్ల కదలికలపైనా గట్టి నిఘా పెట్టారు.
ఇవి కూడా చదవండి:
Independence Day: రేపు జరుపుకునేది 74వ స్వాతంత్య్ర దినోత్సవమా? 75వదా? ఇదిగో క్లారిటీ
నేడు విభజన భయానక జ్ఞాపకాల దినం.. ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Independence Day, Independence Day 2021, Jammu and Kashmir, Terrorists