అత్యంత వివాదాస్పదుడిగా గుర్తింపుపొందిన ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు మాజీ ఛైర్మన్ సయీద్ వసీం రిజ్వీ ఇస్లాం మతాన్ని విడిచిపెట్టి అధికారికంగా హిందూ మతంలోకి మారారు. దాస్నా ఆలయానికి చెందిన మహంత్ నరసింహానంద సరావతి అధికారికంగా రిజ్వీని హిందూ మతంలోకి మార్చారు. ఆయన పేరును జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగిగా మార్చారు. ఇస్లాంపై, మహ్మద్ ప్రవక్తపై వరుసగా అనుచిత వ్యాఖ్యలు చేస్తోన్న వసీం రిజ్వీ ఒక దశలో సుప్రీంకోర్టును సైతం తూలనాడారు. ఆయన తీరుపై భారత్ లోని ఇస్లామిక్ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న క్రమంలో రిజ్వీ ఏకంగా మతాన్నే మార్చుకున్నారు. రిజ్వీ మత మార్పిడిని ఘర్ వాపసీగా సరావతి అభివర్ణించారు. ఈ సందర్భంగా రిజ్వీ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంటూనే సంచలన వ్యాఖ్యలు చేశారు..
హిందూయిజం ప్రపంచంలోని స్వచ్ఛమైన మతమని, 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజును పవిత్రమైనదిగా భావిస్తూ ఇదే రోజున తాను ఇస్లాంను విడిచి హిందువుగా మారానని వసీం రిజ్వీ అలియాస్ జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగి చెప్పారు. నేటి నుంచి హిందూ మతం కోసమే పనిచేస్తానన్న ఆయన.. ఎన్నికల్లో హిందువులను ఓడించడానికి మాత్రమే ముస్లింలు ఓట్లేస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
హిందువుగా మారిన తాను చనిపోయిన తర్వాత మృతదేహాన్ని సంప్రదాయ హిందూ ఆచారాల ప్రకారం దహనం చేయాలని, ముస్లిం ఆచారం ప్రకారం ఖననం చేయకూడదని వీలునామా రాసినట్లు వసీం రిజ్వీ తెలిపారు. తన అంత్యక్రియల చితికి ఘజియాబాద్‌లోని దాస్నా దేవాలయానికి చెందిన హిందూ ధర్మకర్త నరసింహ ఆనంద సరావతి నిప్పంటించాలని కూడా ఆయన వీలునామాలో పేర్కొన్నారు. చాలా కాలంగా ఇస్లాం వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ, మందిర-మసీదు వివాదంలోనూ హిందూ పక్షాలకు వత్తాసుపలికిన రిజ్వీ.. గత నెల 4న చేసిన ఓ పని మతగురువులకు బాగా కోపం తెప్పించింది.
గత నెలలో వసీం రిజ్వీ ఘజియాబాద్ లోని దస్నా దేవీ ఆలయంలో నరసింగానంద్ సరస్వతి సమక్షంలో విడుదల చేసిన ఓ పుస్తకం వివాదాస్పదమైంది. ఆ పుస్తకం కవర్ పేజీ, అందులోని రాతల్ని ముస్లిం సంఘాలు తప్పుపట్టాయి. ఆ బుక్ కవర్ పేజీపై అర్థనగ్నంగా ఉన్న మహిళతో ఓ వ్యక్తి ఉన్న చిత్రం ఉండటంపై చాలా మంది ముస్లిం పెద్దలు,ఆల్ ఇండియా షియా లా బోర్డ్ సహా పలు ముస్లిం ఆర్గనైజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రవక్తను అవమానించాడంటూ రిజ్వీపై పలువురు మండిపడ్డారు. ఇదే అంశంపై మజ్లిస్ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నవంబర్ 17న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను కలిసి రిజ్వీపై కేసు నమోదు చేయాలని విన్నవించారు. పలు రాడికల్ ఇస్లామిక్ సంస్థలు తనను శిరచ్ఛేదం చేయాలని పిలుపునిచ్చినందున ప్రాణహాని ఉందని రిజ్వీ పలుసార్లు వీడియోను విడుదల చేశారు. అయితే అత్యున్నత న్యాయస్థానం రిజ్వీ పిటిషన్‌ను పనికిరానిదిగా పేర్కొంటూ అతనికి రూ.50,000 జరిమానాను విధించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Uttar pradesh