Home /News /national /

FORMER UNION MINISTERS WIFE KILLED AT HOME IN DELHIS VASANT VIHAR WASHERMAN NABBED SK

Kitty Kumaramangalam: మాజీ కేంద్రమంత్రి భార్య దారుణ హత్య.. దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశారు..

కిట్టి కుమారమంగళం (Image:ANI)

కిట్టి కుమారమంగళం (Image:ANI)

Kitty Kumaramangalam Murder: కిట్టీ ఇంట్లోకి వెళ్లినప్పుడు ఓ ఖాళీ సూట్ కేసు ఓపెన్ చేసి ఉందని పోలీసులు తెలిపారు. ఇంట్లో డబ్బు, నగలను దొంగతనం చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే కిట్టీని హత్య చేసి ఉంటారని వెల్లడించారు.

    దేశరాజధాని ఢిల్లీలో తీవ్ర కలకలం రేగింది. మాజీ కేంద్రమంత్రి పీ. రంగరాజన్ కుమారమంగళమ్ భార్య కిట్టీ కుమారమంగళమ్ దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఢిల్లీ వసంత్ విహార్‌‌లోని ఆమె నివాసంలోనే దుండగులు చంపేశారు. ఈ కేసులో ఇప్పటికే ఓ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వసంత్ విహార్‌లోని భన్వర్ సింగ్ క్యాంప్‌కు చెందిన 24 ఏళ్ల రాజు ఈ హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కిట్టీ ఇంట్లో అతడు వాషర్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఎప్పటిలాగే ఆమె ఇంట్లో పనిచేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో కిట్టి మాత్రమే అక్కడ ఉన్నారు. రాజు లోపలికి వెళ్లిన తర్వాత డోర్ పెట్టేసి, కిట్టీపై దాడి చేశాడు. ఆమెను గదిలో బంధించి కాళ్లు చేతులు కట్టేశాడు. ఆ తర్వాత కాసేపటికి మరో ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి వచ్చారు. దిండుతో ఊపిరాడకుండా చేసి ఆమెను హత్య చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    ఈ కేసులో ఇప్పటికే వాషర్ మ్యాన్ రాజును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతడికి సహకరించిన మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాము కిట్టీ ఇంట్లోకి వెళ్లినప్పుడు ఓ ఖాళీ సూట్ కేసు ఓపెన్ చేసి ఉందని పోలీసులు తెలిపారు. ఇంట్లో డబ్బు, నగలను దొంగతనం చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే కిట్టీని హత్య చేసి ఉంటారని వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని.. త్వరలోనే మిగిలిన ఇద్దరు నిందితులను కూడా పట్టుకుంటామని స్పష్టం చేశారు.

    కిట్టీ భర్త పీఆర్ కుమారమంగళం 1984లో సేలం (తమిళనాడు) లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 1998 నుంచి 2000 వరకు తిరుచిరాపల్లి ఎంపీగా పనిచేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు కేబినెట్‌లో జులై 1991 నుంచి డిసెంబరు 1993 వరకు కేంద్ర న్యాయశాఖమంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత వాజ్‌పేయీ ప్రభుత్వంలోనే 1998 నుంచి 2000 వరకు కేంద్రమంత్రిగా పనిచేశారు. 2000 ఆగస్టు 23న ఆయన కన్నుమూశారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Delhi, Murder, New Delhi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు