Home /News /national /

FORMER PM DEVE GOWDA IS SEATLESS HIS SEARCH FOR NEW A SEAT MAKES BOTH JDS AND CONGRESS NERVOUS AK

57 ఏళ్ల రాజకీయ జీవితం... అయినా పోటీకి సీటు లేదు... మాజీ ప్రధానికి విచిత్ర పరిస్థితి

మాజీ ప్రధాని దేవెగౌడ (ఫైల్ ఫోటో)

మాజీ ప్రధాని దేవెగౌడ (ఫైల్ ఫోటో)

గడిచిన 57 ఏళ్లలో 14 సార్లు గెలిచిన దేవేగౌడ... కేవలం రెండుసార్లు మాత్రమే ఓటమిని చవిచూశారు. 1989, 1991లో మినహా... ప్రతిసారీ దేవేగౌడ అసెంబ్లీకో, పార్లమెంట్‌కో ప్రాతినిథ్యం వహిస్తూనే ఉన్నారు. అయితే 16వ లోక్ సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడానికి నియోజకవర్గం దొరకడం లేదు.

ఇంకా చదవండి ...
  (డీపీ సతీష్, సౌత్ హెడ్, న్యూస్‌18)

  ప్రస్తుతం ఉన్న మాజీ ప్రధానమంత్రుల్లో హెచ్.డి. దేవేగౌడ మాత్రమే రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. 85 ఏళ్ల దేవేగౌడ 1962 నుంచి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. గడిచిన 57 ఏళ్లలో 14 సార్లు గెలిచిన దేవేగౌడ... కేవలం రెండుసార్లు మాత్రమే ఓటమిని చవిచూశారు. 1989, 1991లో మినహా... ప్రతిసారీ దేవేగౌడ అసెంబ్లీకో, పార్లమెంట్‌కో ప్రాతినిథ్యం వహిస్తూనే ఉన్నారు. అయితే 16 లోక్ సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడానికి నియోజకవర్గం దొరకడం లేదు. కుటుంబసభ్యుల నుంచి వచ్చిన తీవ్రమైన ఒత్తిడి మేరకు తన సొంత స్థానమైన హసన్‌ను మనవడు ప్రజ్వల్ రేవణ్ణ కోసం విడిచిపెట్టారు దేవేగౌడ. హసన్‌కు పక్కనే ఉన్న మాండ్యలోనూ జేడీఎస్ బలంగా ఉన్నా... అక్కడి నుంచి మరో మనవడైన కుమారస్వామి తనయుడు నిఖిల్ పోటీ చేయనున్నారు.

  పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ వచ్చిన దేవేగౌడ... తాజాగా బెంగూళూరు ఉత్తరం, తూముకురు, మైసూరు స్థానాల వైపు చూస్తున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజకీయ ఒత్తిళ్ల కారణంగా మైసూరు సీటును జేడీఎస్‌కు ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. తూముకురులో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ముద్దుహనుమే గౌడ ఉండటంతో... ఆ సీటును జేడీఎస్‌కు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించడం లేదు.

  బెంగళూరు ఉత్తరం నియోజకవర్గం పరిధిలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండగా, జేడీఎస్ తరపున ఇద్దరు, బీజేపీ తరపున ఒకరు ఉన్నారు. కేంద్రమంత్రి సదానందగౌడ ప్రస్తుతం ఈ స్థానం నుంచి ఎంపీగా వ్యవహరిస్తున్నారు. ఈ సీటును దేవేగౌడకు కేటాయిస్తున్నారనే వార్తల నేపథ్యంలో లోకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ఇక్కడ మాకు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్లకు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇది కచ్చితంగా మాదే. ఇక్కడ మేం ఎలా జేడీఎస్‌కు మద్దతిస్తాం ? అలా చేస్తే అది మాకు వ్యతిరేకంగా మారుతుంది’. అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. బెంగళూరు ఉత్తరం నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో వక్కలిగ, గౌడ ఓటర్లతో పాటు మైనార్టీ ఓటర్లు ఉన్నారు. ఇది తనకు కలిసొస్తుందని దేవేగౌడ భావిస్తున్నారు.

  అయితే కుమారస్వామి సహా జేడీఎస్‌లోని పలువురు నేతలు... బెంగళూరు ఉత్తరం నియోజకవర్గం నుంచి దేవేగౌడ బరిలోకి దిగడాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది. నగర ప్రాంతం ఎక్కువగా ఉండటంతో... దేవేగౌడకు ఇది అంత సేఫ్ కాదనే భావనలో వాళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. జేడీఎస్‌లోని కొందరు మాత్రం దేవేగౌడ తుముకూరు నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ జేడీఎస్ మంచి ఫలితాలు సాధించింది. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ ఇక్కడ దేవేగౌడ పోటీ చేస్తే... ఆయనకు వ్యతిరేకంగా పని చేస్తామని హెచ్చరిస్తున్నారు.

  మైసూరు సీటుపై ఫోకస్ చేసిన దేవేగౌడ... ఇక్కడ వక్కలిగ ఓట్లు అధిక సంఖ్యలో ఉండటంతో తన గెలుపు సులువవుతుందనే భావించారు. మైసూరు నుంచి దేవేగౌడ బరిలోకి దిగడాన్ని వ్యతిరేకించిన మాజీ సీఎం సిద్ధరామయ్య... తన అనుచరుడైన బీజేపీ మాజీ ఎంపీ విజయశంకర్‌ కోసం ఈ సీటును కాపాడుకోవడంలో సక్సెస్ అయ్యారు. జేడీఎస్‌లోని ఓ వర్గం సైతం దేవేగౌడ ఇద్దరు మనవళ్లు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది.

  హసన్, మాండ్యకు చెందిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దేవేగౌడ కుటుంబంలోని మూడోతరం రాకను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. కొందరైతే ఇప్పటికే బీజేపీలో చేరి వీరిని ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారు. మాండ్యలో దివంగత నేత అంబరీష్ భార్య, సినీనటి సుమలత‌పై నిఖిల్ కుమారస్వామి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆమెకు బీజేపీ మద్దతు ప్రకటించింది. స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు బాహాటంగానే ఆమెకు మద్దతు పలుకుతున్నారు. అయితే కొందరు జేడీఎస్ నాయకులు మాత్రం కుటుంబ రాజకీయాలు బెడిసికొట్టే అవకాశం ఉందనే భావనలో ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ మొదలుకానున్న నేపథ్యంలో దీనిపై దేవేగౌడ తొందరగా ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
  First published:

  Tags: Bjp, Congress, Deve gowda, Jds, Karnataka, Kumaraswamy

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు