ముంబై: మహారాష్ట్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 12 గంటల సుదీర్ఘ విచారణ అనంతరం అరెస్ట్ చేసింది. మంగళవారం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టి కస్టోడియల్ రిమాండ్ కోరాలని ఈడీ భావిస్తోంది. మనీలాండరింగ్ కేసులో పలుమార్లు సమన్లు పంపినా ఆయన పట్టించుకోకపోవడం, విచారణకు సహకరించకపోవడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ.100 కోట్ల దాకా మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు అనిల్ దేశ్‌ముఖ్‌పై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ ఆయనను విచారిస్తోంది.
ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ భీర్ సింగ్.. మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ముంబైలోని హోటల్స్, బార్స్ నుంచి నెలకు రూ.100 కోట్ల రూపాయలను ప్రతి నెలా వసూలు చేయాలని అనిల్ దేశ్‌ముఖ్.. అసిస్టెంట్ కమిషనర్‌గా డిస్మిస్ అయిన సచిన్ వాజెను అడిగారనేది పరమ్ భీర్ సింగ్ ప్రధాన అభియోగం.
ఫిబ్రవరి 25న ముంబైలోని ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వాహనం కలకలం రేపడంతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో సచిన్ వాజే ప్రమేయాన్ని ఎన్ఐఏ గుర్తించింది. ఆ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం పరమ్ భీర్ సింగ్‌ను ముంబై పోలీస్ కమిషనర్‌గా తొలగించింది.
ఇదిలా ఉంటే.. మాజీ కమిషనర్ ఆరోపణలపై విచారణ జరపాలని బాంబే హైకోర్టు సీబీఐకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ హోం మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ జరిపిన ఈడీ ముంబై పోలీస్ క్రైం ఇంటెలిజెన్స్ విభాగం హెడ్ సచిన్ వాజే.. ముంబైలోని orchestra bars నుంచి డిసెంబర్ 2020 మరియు ఫిబ్రవరి 2021 మధ్య రూ.4.70 కోట్లు వసూలు చేసినట్లు తేలింది. ఆ డబ్బును తన అసిస్టెంట్ ద్వారా అనిల్ దేశ్‌ముఖ్‌కు చేరవేసినట్లు ఈడీ తెలిపింది. అంతేకాదు.. నాగ్‌పూర్‌లో అనిల్ దేశ్‌ముఖ్ కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ సాయి శిక్షణ్ సంస్థ అనే చారిటబుల్ ట్రస్ట్‌కు ఈ మధ్య కాలంలో రూ.4.18 కోట్ల విరాళాలు ఢిల్లీలోని షెల్ కంపెనీల నుంచి వచ్చినట్లు ఈడీ గుర్తించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Enforcement Directorate, Maharashtra, Mumbai, National News