news18-telugu
Updated: December 2, 2020, 7:08 PM IST
జస్టిస్ సీఎస్ కర్ణన్ (రిటైర్డ్)
హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ సీఎస్ కర్ణన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు జడ్జిల భార్యలు, హైకోర్టు జడ్జిల భార్యలు, మహిళా జడ్జిల మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు చెన్నై పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అసభ్యకరమైన కామెంట్లను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. మద్రాస్ హైకోర్టు లాయర్ ఒకరు అక్టోబర్ 27న మాజీ జస్టిస్ కర్ణన్ మీద చెన్నై సైబర్ సెల్ విభాగానికి ఫిర్యాదు చేశారు. వారిపై లైంగిక దాడులకు పాల్పడతామనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు జస్టిస్ కర్ణన్ చేసిన మరో సంచలన ఆరోపణల వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. కొందరు సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు మహిళా సిబ్బందిని, మహిళా జడ్జిలను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే,2017లో కూడా ఆయన ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు చేసినందుకు సుప్రీంకోర్టు కర్ణన్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. సుప్రీంకోర్టులో ఏడుగురు జడ్జిల ధర్మాసనం ఆయన్ను దోషిగా తేల్చింది. జస్టిస్ కర్ణన్ గతంలో మద్రాస్ హైకోర్టు, కలకత్తా హైకోర్టుల్లో జడ్జిగా పనిచేశారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
December 2, 2020, 7:08 PM IST