ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కన్నుమూత

ఢిల్లీ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ కన్నుమూశారు.

news18-telugu
Updated: July 20, 2019, 4:53 PM IST
ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కన్నుమూత
షీలా దీక్షిత్ (File)
  • Share this:
ఢిల్లీ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె వయసు 81 సంవత్సరాలు. 1938 మార్చి 31న షీలా దీక్షిత్ జన్మించారు. ఢిల్లీకి అత్యంత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఆమె 15 సంవత్సరాల పాటు హస్తిన ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1998 డిసెంబర్ 3 నుంచి 2013 డిసెంబర్ 28 వరకు ఆమె ఢిల్లీ సీఎంగా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత 2014 మార్చి 11 నుంచి అదే సంవత్సరం ఆగస్ట్ 25 వరకు కేరళ గవర్నర్‌గానూ కొనసాగారు. షీలా దీక్షిత్ అసలు పేరు షీలా కపూర్. వినోద్ దీక్షిత్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె పేరు షీలా దీక్షిత్‌గా మారిపోయింది. షీలా దీక్షిత్‌కు ఇద్దరు పిల్లలు. సందీప్ దీక్షిత్, లతికా దీక్షిత్ సయ్యద్. ఆమె విద్యాభ్యాసం మొత్తం ఢిల్లీలోనే సాగింది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ చేశారు.

షీలా దీక్షిత్‌‌కు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఈ రోజు ఉదయం ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. నిపుణులైన వైద్య బృందం ఆమెకు చికిత్స అందించింది. దీంతో షీలా దీక్షిత్ ఆరోగ్యం కొంచెం స్థిమితపడింది. అయితే, మళ్లీ హార్ట్ ఎటాక్ రావడంతో మధ్యాహ్నం 3.55 గంటలకు షీలా దీక్షిత్ చనిపోయారని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.

1984లో షీలా దీక్షిత్ తొలిసారి ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1986 నుంచి 89 వరకు రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంలో సహాయ మంత్రిగా సేవలు అందించారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయితే, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోల్ మార్కెట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి వరుసగా మూడుసార్లు ఆమె ఢిల్లీ సీఎంగా సేవలు అందించారు.

షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని కాగ్ నివేదిక ఇచ్చింది. అయితే, కాంట్రాక్టుల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి పాత్ర ఏ మాత్రం లేదని అప్పటి చీఫ్ సెక్రటరీ పీకే త్రిపాఠీ స్పష్టం చేశారు. షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్భయ గ్యాంగ్ రేప్ జరిగింది.
First published: July 20, 2019, 4:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading