భారతీయ రైల్వేల చరిత్రలో ఇది చరిత్ర సృష్టించిన రోజు...

Indian Railways | భారతీయ రైల్వేల చరిత్రలో తొలిసారి అన్ని రైళ్లు 100 శాతం సరైన సమయానికి చేరుకున్నాయి.

news18-telugu
Updated: July 2, 2020, 2:43 PM IST
భారతీయ రైల్వేల చరిత్రలో ఇది చరిత్ర సృష్టించిన రోజు...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
‘మీరు ఎక్కాల్సిన రైలు ఓ జీవితకాలం లేటు.’ అన్నాడో సినీ కవి. ఇన్నాళ్లూ రైళ్లు సమయానికి నడవకపోతే ఇదే సామెత వాడేవారు. అయితే, ఇప్పుడు భారతీయ రైల్వే చరిత్ర సృష్టించింది. నవ చరిత్రకు నాంది పలికింది. భారతీయ రైల్వేల చరిత్రలో తొలిసారి అన్ని రైళ్లు 100 శాతం సరైన సమయానికి చేరుకున్నాయి. ఈ అద్భుత ఘట్టం గురువారం ఆవిష్కృతమైంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం 230 ప్రత్యేక రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఆ రైళ్లను కచ్చితమైన సమయానికి గమ్యస్థానాలకు చేరేలా చూడాలంటూ రైల్వే శాఖ ఆయా జోన్లను ఆదేశించింది. దేశవ్యాప్తంగా 13000 రైళ్లు ఉన్నాయి. అందులో 200 రైళ్లు అంటే 2 శాతం కన్నా కూడా తక్కువే. ‘భారత రైల్వేల చరిత్రలో కొత్త అధ్యాయం. అన్ని రైళ్లు 100 శాతం సరైన సమయానికి గమ్యస్థానాలకు చేరుకున్నాయి. గతంలో జూన్ 23, 2020న ఒకరైలు ఆలస్యంగా వచ్చింది. దీంతో రికార్డు 99.54 శాతంగా నమోదైంది.’ అని రైల్వే శాఖ చెప్పినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

రైల్వే బోర్డు చైర్మన్ వైకే యాదవ్ చెప్పిన దాని ప్రకారం 30 రాజధాని రైళ్లు, 200 ప్రయాణికుల రైళ్లు ఏ మాత్రం ఆలస్యంగా నడవకూడదని, నిర్ణీత సమయానికి చేరుకోవాలని అన్ని జోన్ల జనరల్ మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లను ఆదేశించారు. ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల సంఖ్య తక్కువే అయినా ఆలస్యం కావొద్దని స్పష్టం చేశారు. మరోవైపు ఢిల్లీ - ముంబై, ఢిల్లీ - హౌరా మార్గంలో రైళ్ల వేగాన్ని గంటకు 130 కి.మీ వరకు పెంచేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఈ రూట్లలో ఫిట్ నెస్, సిగ్నలింగ్ సిద్ధమైందని తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ రెండు రూట్లలో రైళ్ల వేగాన్ని పెంచి నడపనున్నారు.

మరోవైపు రైల్వే ప్రైవేటీకరణ దిశగా కేంద్రం మరో కీలక అడుగు ముందుకేసింది. రైల్వేల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించింది. మొత్తం 109 రూట్లలో ప్రైవేట్ ప్యాసింజర్ రైళ్లకు అనుమతిచ్చింది కేంద్రం. ఈ మేరకు రైల్వేల్లో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం కోసం రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ (RFQ)కు ఆహ్వానించింది. భారతీయ రైల్వే నెట్‌వర్క్ పరిధిలోని మొత్తం 12 క్లస్టర్లలో 109 రూట్లలో ప్రైవేట్ రైళ్లకు అనుమతిచ్చింది కేంద్రం. దీని ద్వారా రైల్వేశాఖలోకి రూ.30వేల కోట్ల ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తోంది.

109 రూట్లో మొత్తం 151 అధునాతన రైళ్లు నడుస్తాయి. ఒక్కో రైలుకు 16 కోచ్‌లు ఉంటాయి. రైళ్లు గరిష్టంగా గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. ఆయా ప్రైవేట్ సంస్థలు రైల్వేశాఖకు రవాణా చార్జీలు, విద్యుత్ చార్జీలు, గ్రాస్ రెవెన్యూలో వాటా చెల్లించాల్సి ఉంటుంది. వాటికి 35 ఏళ్ల పాటు ప్రభుత్వ రాయితీలు అందుతాయి. ఇక ఈ ప్రైవేట్ రైళ్లలోనూ భారతీయ రైల్వేకు చెందిన లోకో పైలట్, గార్డ్ విధులు నిర్వహిస్తారు. రైళ్ల నిర్వహణతో పాటు ప్రయాణ సమయాన్ని తగ్గించడం, ఉపాధి కల్పన, ప్రయాణికుల భద్రత, ప్రయాణికులకు అంతర్జాతీయ ప్రమాణాలతో రైలు ప్రయాణ అనుభూతి కలిగించాలన్న ఉద్దేశంతోనే రైల్వేలోకి ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
First published: July 2, 2020, 2:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading