పార్లమెంట్ క్యాంటీన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడ అన్ని అహార పదార్థాలు చాలా చౌకగా లభిస్తుంటాయి. టీ నుంచి బిర్యానీ వరకు.. ఏది తిన్నా అంతే. చాలా తక్కువ రేటు ఉంటుంది. క్వాలిటీ మాత్రం ఫైవ్ స్టార్ హోటల్‌లా ఉంటుంది. కానీ ఇకపై పార్లమెంట్ క్యాంటిన్‌లో ఆహార పదార్థాల ధరలు భారీగా పెరగబోతున్నాయి. ఎందుకంటే పార్లమెంట్ క్యాంటిన్లో ఫుడ్ సబ్సిడీని పూర్తిగా ఎత్తేశారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం ప్రకటన చేశారు. అంతేకాదు క్యాంటిన్ నిర్వహణ బాధ్యతల నుంచి నార్తర్న్ రైల్వేస్ (ఉత్తర రైల్వే)ను తప్పించి.. ITDC (ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్)కు అప్పగించారు.
Food subsidy at Parliament canteen has been completely removed: Lok Sabha Speaker Om Birla pic.twitter.com/XB0NB5PbCb
— ANI (@ANI) January 19, 2021
పార్లమెంట్‌లోని క్యాంటిన్‌లోని ఆహార పదార్థాలపై ఎంపీలు, సిబ్బందికి 80శాతం సబ్సిడీ ఉంటుంది. ఆహార పదార్థాలపై ఏటా రూ.17 కోట్లు ఖర్చవుతుండగా.. వీటిలో దాదాపు రూ.14 కోట్లను పార్లమెంట్ సిబ్బంది, సందర్శకులే వినియోగించుకుంటున్నారు. ఎంపీలు తక్కువ మొత్తంలో వినియోగించుకున్నారు. అంతేకాదు చివరగా 2016లో మెనూ ధరలను సవరించారు. కోటాను కోట్ల ఆస్తులుండే ఎంపీలకు అతి తక్కువ ధరకే సబ్సిడీపై ఆహారం అందించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంట్ క్యాంటిన్‌లో ఆహార పదార్థాలపై సబ్సిడీని పూర్తిగా ఎత్తివేశారు.
కాగా, జనవరి 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సమావేశాలు నిర్వహిస్తారు. ఎంపీలు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్యసభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుంది. ఇక లోక్‌సభ సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు జరుగుతుంది. బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే ఎంపీలంతా కోవిడ్ పరీక్షలు ఖచ్చితంగా చేయించుకోవాలని స్పీకర్ ఓం బిర్లా సూచించారు. ఫిబ్రవరి 2న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian parliament, Parliament