Union health minister letter to rahul gandhi : బీజేపీ(BJP)నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విభజన రాజకీయాలను ఎదుర్కోవడానికి, దేశ, ప్రజా సమస్యలను మరింత లోతుగా తెలుసుకునేందుకంటూ కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర(BHARAT JODO YATRA)పేరిట భారీ పాదయాత్ర కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్ల పాదయాత్రను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)సెప్టెంబర్ 7న కన్యాకమారిలో ప్రారంభించారు. 150 రోజుల పాటు సాగే పాదయాత్రలో 12 రాష్ట్రాలను కవర్ చేయనున్నారు. తమిళనాడులో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర రాజస్తాన్ నుంచి ఇవాళ హర్యానాలో ప్రవేశించింది. అయితే చైనా,జపాన్, అమెరికా, బ్రెజిల్, దక్షిణ కొరియా దేశాల్లో మళ్లీ కరోనా విజృంభిస్తోందనే వార్తల నేపథ్యంలో మంగళవారం అన్ని రాష్ట్రాలకు,కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ రాసిన విషయం తెలిసిందే. కొవిడ్ ముప్పు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో పాల్గొనేవారంతా కచ్చితంగా కోవిడ్-19 నిరోధక మార్గదర్శకాలను పాటించాలని, ఈ యాత్రలో కోవిడ్ మార్గదర్శకాలు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీతోపాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ లేఖ రాశారు.
వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులే భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని సూచించారు. యాత్రలో పాల్గొనే వాళ్లంతా మాస్క్‌లు ధరించేలా, శానిటైజర్లు వాడేలా పర్యవేక్షించాలన్నారు. ఒకవేళ ఈ నిబంధనలను పాటించడం సాధ్యం కాదని అనుకుంటే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని యాత్రను నిలిపేయాలని లేఖలో స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి లేఖ రాయడంపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భారత్ జోడో యాత్ర మన్‌సుఖ్ మాండవీయకు ఇష్టం లేనట్లుందని, అయితే ప్రజలు మాత్రం ఇష్టపడుతున్నారని..రాహుల్‌తో కలిసి నడుస్తున్నారని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. యాత్రపై నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ ప్రయత్నం అని విమర్శించారు. గుజరాత్ ఎన్నికల ప్రచార సభల్లో కోవిడ్ నిబంధనలను పాటించారా అని నిలదీశారు.
భారత్ జోడో యాత్ర హర్యానాలో ప్రవేశించిన సందర్భంగా నుహ్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ఈ యాత్ర ద్వారా విద్వేష విపణిలో ప్రేమ దుకాణాన్ని తెరుస్తోందని చెప్పారు. నువ్వు ఏం చేస్తున్నావ్? కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఎందుకు నడుస్తున్నావని బీజేపీ నేతలు తనను ప్రశ్నిస్తున్నారన్న రాహుల్ గాంధీ.. ద్వేషపూరితం చేసే ఓ మార్కెట్‌లో ప్రేమను పంచే దుకాణాన్ని తెరిచానని వారికి చెబుతున్నానని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్, నెహ్రూ, ఆజాద్ వంటి నేతలందరూ ఇలాగే ప్రేమను పంచారని, ఇప్పుడు తాను వారి బాటలోనే నడుస్తున్నట్టు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bharat Jodo Yatra, Congress, Covid -19 pandemic, Health ministry, Rahul Gandhi