కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌కు 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. జమ్మూకాశ్మీర్ బడ్జెట్ మొత్తం విలువ రూ. 1.42 లక్షల కోట్ల రూపాయలుగా నిర్మల ప్రతిపాదించారు. అదే సమయంలో, గతేడాది(2021-22 సంవత్సరానికిగానూ) ఇదే జమ్మూకాశ్మీర్ కు మొత్తం రూ. 18,860.32 కోట్ల అనుబంధ డిమాండ్‌లను కూడా ఆమె సమర్పించారు. జమ్మూకాశ్మీర్ బడ్జెట్ సందర్భంగా లోక్ సభలో రచ్చ చోటుచేసుకుంది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలితంగా మారడం, గత రెండేళ్లుగా అక్కడ ఎన్నికలు జరగకపోవడంతో రాష్ట్ర బడ్జెట్ ను కేంద్రమే ప్రతిపాదించాల్సి వస్తున్నది. కాగా, జమ్మూకాశ్మీర్ కు రూ.1.42 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిన నిర్మల.. ఇవాళే దానిపై సభలో చర్చ చేపట్టేలా, ఇవాళే చర్చను ముగించేందుకు వీలుగా నిబంధనల సడలింపునకు కూడా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కానీ..
బడ్జెట్ సమర్పించిన రోజే చర్చను ముగించేలా ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి విపక్షాలు అడ్డు తగిలాయి. జమ్మూకాశ్మీర్ బడ్జెట్ ప్రతిపాదనలను అధ్యయనం చేయడానికి తగిన సమయం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. బడ్జెట్ రోజునే దానిపై చర్చ చేపట్టడం పార్లమెంట్ నియమావళిలో 205వ నిబంధనకు విరుద్ధమని కాంగ్రెస్ సభ్యుడు మనీష్ తివారీ, ఆర్‌ఎస్‌పి సభ్యుడు ఎన్‌కె ప్రేమచంద్రన్ వాదించారు. కానీ స్పీకర్ వారి అభ్యర్థనలను తిరస్కరించారు. అంతకుముందు,
రెండో విడత బడ్జెట్ సమావేశాల సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 8తో ఇవి ముగుస్తాయి. తొలిరోజు లోక్ సభకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీ ఎంపీలు అపూర్వస్వాగతం పలికారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన నాలుగు రాష్ట్రాల్లోనూ తిరిగి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మోదీని కీర్తిస్తూ ఎంపీలు నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల తరలింపు గురించి డీఎంకే నేత టీఆర్ బాలు లేవనెత్తారు. టూరిజం శాఖలో కోవిడ్ వల్ల దెబ్బతిన భారతీయ ఉద్యోగులను ఆదుకోవాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వేడుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.