బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాలు ఇప్పుడు ప్రపంచమంతటా హాట్‌టాపిక్‌గా మారాయి. ఇథియోపియాలో జరిగిన ప్రమాదంతో ..ఆ రకం విమానాలపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. యూరోపియన్ యూనియన్, యూకే, చైనా, ఆస్ట్రేలియా, సింగపూర్, టర్కీ, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, సౌత్ కొరియా, మంగోలియా, ఇండోనేసియా దేశాలు నిషేధం విధించాయి. తమ దేశ గగనతలంలోకి బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాలకు అనుమతి నిరాకరించాయి. తాజాగా భారత్ కూడా ఆ జాబితాలో చేరింది.
భారత పౌరవిమానయాన శాఖ ఆదేశాల మేరకు ఆయా విమానసంస్థలు బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాలను ఆకాశం నుంచి భూమికి దించేశాయి. స్పెస్‌జెట్ సంస్థ ఇప్పటికే 14 విమానాలను రద్దుచేసింది. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. గురువారం నుంచి బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాల స్థానంలో ఇతర విమానాలను నడుపుతామని ఓ ప్రకటనలో వెల్లడించింది.
సాధారణంగా కాలం చెల్లిన పాత విమానాలు ఎక్కువగా కూలుతుంటాయి. కానీ బోయింగ్ 737 మ్యాక్స్ లేటెస్ట్ మోడల్ విమానాలు. ఐతే విమానాలు ఆగిపోయే సమయంలో పైలట్లను యాంగిల్ ఆఫ్ అటాక్ సెన్సర్లు అప్రమత్తం చేస్తాయి. బోయింగ్ 737 మ్యాక్స్ సెన్సర్లు, వాటితో అనుసంధానమైన సాఫ్ట్వేర్.. పాతతరం విమానాలతో పోలిస్తే భిన్నంగా పనిచేస్తాయి. కానీ ఈ విషయం పైలట్లకు చెప్పకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, మూడు రోజుల క్రితం ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం కుప్పకూలింది. ఆ ప్రమాదంలో 157 మంది చనిపోయారు. మృతుల్లో పలువురు భారతీయులు ఉన్నారు. అదిస్ అబాబా నుంచి నైరోబీకి వెళ్తున్న విమానం కుప్పకూలింది. గతేడాది కూడా ఇదే రకం విమానం ఇండోనేసియాలో కూలిపోయింది. లయన్ ఎయిర్ సంస్థ విమానం కూలి 189 మంది చనిపోయారు. బోయింగ్ 737 మ్యాక్స్ మోడల్ విమానాలు వరసగా ప్రమాదాల బారిన పడుతున్న నేపథ్యంలో...వాటిపై ప్రపంచ దేశాలన్నీ నిషేధం విధిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.