దేశంలో దశాబ్దాలుగా వివాదాస్పదంగా మారిన... అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం చేపట్టబోతోంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జడ్జిలు బాబ్డే, చంద్రచూడ్, అశోక్ భూషణ్, అబ్దుల్ నజీర్ సభ్యులుగా ఉంటారు. గత నెల 29న అయోధ్య కేసు విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా, జస్టిస్ బాబ్డే సెలవుపై వెళ్లడంతో విచారణ వాయిదా పడింది. ఆయన సెలవు ముగించుకుని విధుల్లోకి రావడంతో విచారణ ప్రారంభమవుతోంది. అయోధ్యపై దాఖలైన పిటిషన్పై విచారించడానికి సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిలతో ధర్మాసనం ఏర్పాటు చేసింది. వివాదాస్పద రామజన్మ భూమిపై 2010 సెప్టెంబర్ 30న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం విచారిస్తుంది.
అయోధ్య సమస్యపై అలహాబాద్ హైకోర్టు 3 మార్గాలను సూచిస్తూ, తీర్పు ఇచ్చింది. 2.77 ఎకరాల రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థలాన్ని నిర్మోహీ అఖారా, సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, రామ్ లల్లాలకు కేటాయించింది. దీన్ని సవాలు చేస్తూ కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు.
ఇవాళ ప్రారంభమయ్యే విచారణ కొన్ని రోజులపాటూ కొనసాగే అవకాశాలున్నాయి. ప్రధానంగా 67.703 ఎకరాల స్థలాన్ని ఎలా కేటాయించాలనేదానిపై ఐదుగురు సభ్యుల బెంచ్ విచారించబోతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.