FIRST TIME IN CHHATTISGARH ELECTRICITY WAS PRODUCED FROM SEIZED GANJA 5 MW FROM 12 TONNES GANJA SK
Electricity From Ganja: గంజాయిని తగులబెట్టి కరెంట్ తయారీ.. పోలీసుల ఐడియా అదిరిందిగా..
ప్రతీకాత్మక చిత్రం
Electricity From Ganja: సాధారణంగా 10 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే దాదాపు 20 టన్నుల బయోమాస్ మెటీరియల్‌ను దహనం చేయాల్సి ఉంటుంది. అలా మొత్తం 12 టన్నుల గంజాయిని దాదాపు 5 గంటల పాటు మండించి.. 5 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇటీవల మాదకద్రవ్యాల (Drugs Consumption) వాడకం పెరిగిపోయింది. నిత్యం ఏదో ఒక చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. కొకైన్, హెరాయిన్ వంటి వాటితో పాటు పెద్ద మొత్తంతో గంజాయి పట్టుబడుతోంది. ఇలా స్వాధీనం చేసుకున్న గంజాయి (Ganja)ని పోలీసులు ఏం చేస్తారో తెలుసా? మాదక ద్రవ్యాలు, అక్రమంగా పట్టుబడిన మద్యాన్ని పోలీసులు ఓ స్టోర్ రూమ్‌లో భద్రపరుస్తారు. అలా కొన్ని రోజుల తర్వాత పెద్ద మొత్తంలో నిల్వలు పేరుకుపోతాయి. అనంతరం వాటిని కోర్టు అనుమతితో ధ్వంసం చేస్తారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలను తగులబెడతారు. అక్రమ మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్లతో తొక్కిస్తారు. ఇలాంటివి మనం టీవీల్లో చాలా సార్లు చూశాం. కానీ ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. గంజాయిని తగులబెట్టకుండా.. దానితో విద్యుత్‌ను తయారు చేసి..శభాష్ అనిపించుకున్నారు.
జూన్ 12 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాలను నుంచి విముక్తి పేరుతో పక్షం రోజుల పాటు వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యంపై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించడంతో పాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. పట్టుబడిన మాదకద్రవ్యాలు, మద్యాన్ని ధ్వంసం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో కూడా ఈ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఐతే ఇక్కడి పోలీసులు కాస్త వినూత్నంగా ఆలోచించారు. పట్టుబడిన గంజాయిని బహిరంగ ప్రదేశాల్లో తగులబెడితే.. పర్యావరణానికి నష్టం జరుగుతుంది. అలా కాకుండా బయోమాస్ పవర్ ప్లాంట్‌కు అప్పగిస్తే.. దానితో విద్యుత్ తయారవుతుంది. ఈ ఆలోచనలతోనే పెద్ద మొత్తంలో గంజాయిని మండించి.. కరెంట్‌ను తయారు చేశారు.
భిలాస్పూర్ రేంజ్ పరిధిలోని 6 జిల్లాల్లో మాదకద్రవ్యాలకు సంబంధించి 553 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 12 టన్నుల గంజాయిని పొలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి తగులబెట్టి పర్యావరణానికి హాని చేయకుండా.. బయోమాస్ పవర్ ప్లాంట్‌కు అప్పగించారు. రతన్‌పూర్‌లోని సుధా బయో పవర్ ప్లాంట్‌లో గంజాయిని మండించి.. విద్యుత్‌ను తయారుచేశారు. సాధారణంగా 10 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే దాదాపు 20 టన్నుల బయోమాస్ మెటీరియల్‌ను దహనం చేయాల్సి ఉంటుంది. అలా మొత్తం 12 టన్నుల గంజాయిని దాదాపు 5 గంటల పాటు మండించి.. 5 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు.
బయో పవర్ ప్లాంట్స్‌లో బయో మాస్ మెటీరియల్‌ను బాయిలర్‌లో వేసి మండిస్తారు. దాని నుంచి అధిక ఉష్ణోగ్రత విడుదలై బాయిలర్‌లోని పైపుల్లో ఉన్న నీరు.. అధిక పీడనంతో కూడిన ఆవిరిగా మారుతుంది. ఆ స్టీమ్‌ను టర్బైన్ల మీదుగా పంపడంతో.. అవి అధిక వేగంతో తిరుగుతాయి. టర్బైన్లను జనరేటర్ షాప్ట్కు కనెక్ట్ చేయడం వల్ల.. అది తిరిగి.. విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇలానే గంజాయిని మండించి.. విద్యుత్ తయారు చేశారు ఛత్తీస్‌గఢ్ అధికారులు. పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయిని తొలిసారిగా బయోమాస్ ప్లాంట్‌లో వినియోగించినట్లు ఐజీ రతన్‌లాల్ డాంగి తెలిపారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.