దేశ ఆర్థిక కార్యకలాపాలకు రాజధానిగా ఉన్న మహానగరం ముంబైలో గురువారం అర్ధరాత్రి ఒక మాల్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలేమీ అందుబాటులో లేకపోయినా.. మంటలార్పే క్రమంలో ఇద్దరు అగ్ని మాపక సిబ్బంది మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ ముంబైలోని నాగ్పాడ ప్రాంతంలో ఉన్న ఒక మాల్ లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ మాల్ పక్కనే 55 అంతస్థుల అపార్ట్మెంట్ ఒకటి ఉంది. దీంతో అక్కడ ఉంటున్న 3,500 మందిని ఆ భవనం నుంచి వేరే చోటుకు తరలించారు. వారంతా సురక్షితంగానే ఉన్నట్టు సమాచారం. కాగా మంటలు మాత్రం ఇంకా అదుపులోకి రాకపోవడంతో అగ్ని మాపక సిబ్బంది మంటలార్పే ప్రయత్నాలు చేస్తున్నారు.
దక్షిణ ముంబైలోని నాగ్ఫాడ ప్రాంతంలో గల సిటీ సెంటర్ మాల్ లో గురువారం రాత్రి 9 తొమ్మిది గంటలకు చిన్నగా మంటలు రేగినట్టు సమాచారం. రెండవ అంతస్తులో చెలరేగిన మంటలు.. మూడో అంతస్తు దాకా వ్యాపించాయి. అది మెల్లమెల్లగా చెలరేగుతూ.. శుక్రవారం తెల్లవారుజామున 2.40 కల్లా ఎక్కువైంది. మాల్ లో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన అక్కడి సిబ్బంది.. అగ్నిమాపక దళాలకు, పోలీసులకు సమాచారమందించారు. దీంతో తక్షణమే అక్కడకు చేరుకున్న ఫైరింజన్లు మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యాయి.
అయితే పక్కన అపార్ట్మెంట్ లో ఉన్న జనాలను పోలీసులు ఇతర ప్రాంతాలకు సురక్షితంగా తరలించే ఏర్పాట్లు చేశారు. కొందరిని అండర్ గ్రౌండ్ మార్గం ద్వారా బయటకు తీసుకురాగా.. మరికొంతమందిని పక్కనే ఉన్న బిల్డింగ్ నుంచి బయటకు తీసుకొచ్చారు.
మంటలను ఆర్పడానికి పోలీసులు.. 24 ఫైరింజన్లు, 16 జంబో ట్యాంకర్లను తీసుకొచ్చారు. సుమారు 250 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fire Accident, Mumbai