దేశంలో కరోనా వైరస్ మూడో వేవ్ ఉధృతంగా సాగుతుండంగా, ఆస్పత్రుల్లో చేరికలు భారీగా పెరుగుతోన్న వేళ అగ్నిప్రమాద ఘటనలు కలకలం రేపుతున్నాయి. తొలి, రెండో వేవ్ లో ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాల వల్లే పెద్ద సంఖ్యలో రోగులు చనిపోయిన ఉదంతాలున్నాయి. తాజా ఘటన పశ్చిమ బెంగాల్ లోని బర్ద్వాన్ మెడికల్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. కొవిడ్ వార్డులో మంటలు చెలరేగడంతో ఓ రోగి ప్రాణాలు కోల్పోయింది. వివరాలివి..
పశ్చిమ బెంగాల్ లోని ప్రఖ్యాత బుర్ద్వాన్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఆస్పత్రిలో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొవిడ్ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రోగులు బెంబేలెత్తిపోయారు. నిమిషాల్లోనే మంటలు వార్డు మొత్తం వ్యాపించడంతో రోగులు భయంతో బయటికి పరుగులు తీశారు. దాదాపు కదల్లేని స్థితిలో ఒక కొవిడ్ రోగి మంటల్లో చిక్కుకొని చనిపోయారు.
ఆస్పత్రిలో అగ్నిప్రమాదం ఘటనలో చనిపోయిన కొవిడ్ రోగిని తూర్పు బుర్ద్వాన్ జిల్లాకు చెందిన సంధ్యా రాయ్ (60)గా గుర్తించారు. మంటలను గుర్తించిన అనే మహిళా రోగి మరణించారు. మంటలను గుర్తించిన వెంటనే అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించామని బుర్ద్వాన్ మెడికల్ కాలేజీ అధికారులు తెలిపారు.
కొవిడ్ వార్డులో మంటలను అదుపు చేయడానికి దాదాపు గంట సమయం పట్టిందని, ప్రస్తుతం పరిస్థితి చక్కబడిందని ఫైర్ ఫైటర్లు పేర్కొన్నారు. కాగా, నిర్వహణ వైఫల్యాన్ని అంగీకరించడానికి బుర్ద్వాన్ ఆస్పత్రి వర్గాలు నిరాకరించాయి. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే కారణాన్ని తెలుసుకోవడానికి ఐదుగురు సభ్యుల దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని, ఫోరెన్సిక్ విచారణ కూడా జరుగుతుందని బుర్ద్వాన్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ప్రిన్సిపల్ ప్రబీర్ సేన్‌గుప్తా మీడియాకు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid, Fire Accident, Hospitals, West Bengal