రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. సిగ్గులేకుండా ప్రయత్నాలు చేస్తోందంటూ బీజేపీ మీద మండిపడ్డారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన అశోక్ గెహ్లాట్ ‘ఈరోజు నేను ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిస్థితుల మీద చర్చించేందుకు మీ ముందుకు వచ్చా. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నా. కానీ, బీజేపీ మాత్రం మానవత్వం మరిచిపోయింది. మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర పన్నుతోంది.’ అని ఆరోపించారు. ‘కొంతమంది సిగ్గులేని వాళ్లు ఉంటారు. సిగ్గుకి కూడా ఓ పరిమితి ఉంటుంది. గుజరాత్లో ఏడుగురు ఎమ్మెల్యేలను ఎత్తుకెళ్లి రెండు సీట్లు సాధించారు. ఇక్కడ కూడా అలాగే చేయడానికి ప్రయత్నించారు. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర ఎమ్మెల్యేలు సహకారంతో మేం రెండు సీట్లు సాధించాం. ఆ సిగ్గులేని వాళ్లు ఇంకా పాత టెక్నిక్‌లు వాడుతూనే ఉన్నారు.’ అని గెహ్లాట్ అన్నారు.
రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నించారనే ఆరోపణలతో తాజాగా ఇద్దరు బీజేపీ నేతలను ఎస్ఓజీ అధికారులు అరెస్టు చేశారు. ప్రభుత్వాన్ని కూల్చడానికి రూ.1000 కోట్ల నుంచి రూ.2000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వారి సంభాషణల్లో ఉందని అన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వస్తుందని, సీఎంను పార్టీ హైకమాండ్ ఎంపిక చేస్తుందని చర్చించుకున్నారు. రాజ్యసభ ఎన్నికలకు ముందే ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర చేశారంటూ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్‌కు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని, 5 - 10 రోజుల్లో ప్రమాణస్వీకారం చేసే అవకాశం కూడా ఉందనేలా సంభాషణలు ఉన్నాయి.
Published by:Ashok Kumar Bonepalli
First published:July 11, 2020, 16:44 IST