మోదీ ఇలాకాలో ప్రియాంక గాంధీ గర్జన -న్యాయం దక్కేదాకా నో కాంప్రమైజ్ -Lakhimpurపై కాంగ్రెస్ కీలక వ్యూహం

వారణాసిలో ప్రియాంక గాంధీ సభ

Priyanka Gandhi in Varanasi | లఖీంపూర్ ఖేరీ హింసాకాండ నేపథ్యంలో ఇటు ఉత్తరప్రదేశ్, అటు కేంద్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఉధృతం చేసింది. రైతులకు న్యాయం దక్కేదాకా పోరాడుతామంటూనే, దేశంలో రాజకీయ మార్పునకు సైతం నడుంకట్టామని, దేశ ముఖచిత్రం మారేదాకా విశ్రమించబోమని ఆ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రా చెప్పారు. ప్రధాని మోదీ ఇలాకా వారణాసిలో ఆదివారం నాడు ప్రియాంక పాల్గొన్న ‘కిసాన్ న్యాయ్’ సభకు జనం పోటెత్తారు. వివరాలివి..

  • Share this:
అధికారంలో ఉన్న బీజేపీ నేతలు, వారి కార్పొరేట్ మిత్రులలకు తప్ప దేశంలో మిగతావాళ్లెవరికీ భద్రత లేదని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. ఈ దేశం మోదీ లేదా ఏ కొందరిదో కాదన్న నిజాన్ని గుర్తెరిగి అధికార మార్పు కోసం ప్రజలంతా పోరాటానికి సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పార్లమెంట్ నియోజకవర్గమైన వారణాసిలో ఆదివారం నిర్వహించిన ‘కిసాన్ న్యాయ్’ ర్యాలీని ఉద్దేశించి ప్రియాంక కీలక ప్రసంగం చేశారు..

ఇటీవల యూపీలోని లఖీంపూర్ ఖేరీ జిల్లాలో రైతులపై హత్యాకాండకు పాల్పడిన కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రాను యోగి ప్రభుత్వం కాపడుతోందని ఆరోపించిన ప్రియాంక.. రైతులకు న్యాయం దక్కేదాకా తాను, కాంగ్రెస్ పోరాడుతామని, జైల్లో పెట్టి కొట్టినా సరే పోరాటం ఆపబోమని తెలిపారు. లఖీంపూర్ లో ఇంతటి దుర్ఘటన జరిగిన తర్వాత కూడా మోదీ లక్నో వచ్చివెళ్లారేగానీ చనిపోయిన రైతులు లేదా బీజేపీ కార్యకర్తలను గుర్తించకపోవడం దారుణమన్నారు ప్రియాంక. లఖింపూర్ కేసు విచారణ సాఫీగా సాగాలంటే అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోతోంటే, మోదీ మాత్రం తనకోసం ప్రత్యేకంగా వందల కోట్లతో విమానాలు చేయించుకున్నారని, ఇది చాలదన్నట్లు ప్రభుత్వరంగ సంస్థలను ఎడాపెడా అమ్మేస్తున్నారని ప్రియాంక మండిపడ్డారు. ఈ దేశం మోదీ లేదా ఆయన స్నేహితులది మాత్రమే కాదని, దేశ నిర్మాతలు ప్రజలేనని, దేశాన్ని తిరిగి ప్రజలే సొంతం చేసుకునేలా పోరాడాలని , మార్పు కోరుకుంటే గనుక తనతో కలిసిరావాలని, మార్పు కోసం తుదకంటా పోరాడుతానని ప్రియాంక అన్నారు. ఇదిలా ఉంటే,

లఖీంపూర్ ఖేరీ ఘటనపై రాష్ట్రపతిని కలిసేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. రైతులపై హింసాకాండను కోవింద్ కు వివరించి, దర్యాప్తు సజావుగా సాగేలా ఆదేశాలిచ్చేలా రాష్ట్రపతిని కోరాలని కాంగ్రెస్ భావిస్తున్నది. రాహుల్ గాంధీ నేతృత్వంలోని బృందం రాష్ట్రపతిని కలుస్తుందని, ఇందుకోసం రాష్ట్రపతి భవన్ అపాయింట్మెంట్ కోరామని కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. కానీ కొద్ది సేపటికే ఆ ట్వీట్ ను పార్టీ డిలిట్ చేయడం గమనార్హం.
Published by:Madhu Kota
First published: