Parliament : భారత్‌లో భయంలోని, కచ్చితమైన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం ఇప్పుడు ఉంది అన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆమె ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఒకప్పుడు ఇండియా తన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఇతర దేశాలపై ఆధారపడేదన్న ఆమె.. ఇప్పుడు ఇతర దేశాలే ఇండియాపై ఆధారపడే పరిస్థితి ఉంది అన్నారు. చిన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆమె... పీఎం కిసాన్ స్కీమ్ కింద కేంద్రం భారీగా ఖర్చు పెట్టిందని తెలిపారు. 11 కోట్ల మంది చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
గత తొమ్మిదేళ్లలో పేదలను లక్ష్యంగా చేసుకున్న ప్రభుత్వ పథకాలు.. విధానాలను వివరించిన ద్రౌపది ముర్ము... నీరు, గృహాలు, గ్యాస్ సిలిండర్లు, ఆహారం - ఇలా వ్యక్తి జీవితంలోని ప్రతి అంశాన్నీ ప్రధాని మోడీ ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుందని ఆమె తెలిపారు. ఉచిత భోజన కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ.3.5 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసిందని ఆమె తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం - పేదలకు ఆరోగ్య బీమా కల్పించి.. పేదలు రూ.80,000 కోట్లు ఆదా చేసేలా చేసిందని తెలిపారు.
పేదలు, దళితులు, వెనకబడినవారు, ఆదివాసీల ఆశలను కేంద్రం నెరవేర్చుతోందన్న ఆమె.. తొలిసారిగా ప్రభుత్వం.. బిర్సా ముండా పుట్టిన రోజును నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. నక్సలిజం కొన్ని జిల్లాలకే పరిమితం అయ్యిందన్న ఆమె... ఆదివాసీ ఏక్తా మిషన్ కింద 36వేల ఆదివాసీ కుటుంబాలు లబ్ది పొందుతున్నాయని తెలిపారు.
కేంద్రం.. దేశానికి అతి పెద్ద శత్రువుగా అవినీతిని చూస్తోందన్న ముర్ము.. ఆర్థిక అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు కేంద్రం కఠినమైన ఆర్థిక చట్టాన్ని (Fugitive Economic Offenders Act) తెచ్చిందని తెలిపారు.
భారతదేశంలో తయారీ సామర్థ్యం పెరుగుతోందనీ.. అంతర్జాతీయ తయారీదారులు భారతదేశానికి వస్తున్నారని ముర్ము తెలిపారు. సెమీ కండక్టర్లు, విమాన విడిభాగాల తయారీ దిశగా భారత్ దూసుకుపోతోందన్న ఆమె... బొమ్మల దిగుమతులు 70% పడిపోయాయనీ... ఎగుమతులు 60% పైగా పెరిగాయని తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాల వల్ల రక్షణ ఎగుమతులు 6 రెట్లు పెరిగాయన్నారు. భారతదేశం మొబైల్ ఫోన్లు, విడిభాగాల కోసం ప్రపంచ తయారీ కేంద్రంగా మారిందన్నారు.
ఈ ప్రసంగం తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ .. ఆర్థిక సర్వే (Economic Survey)ను ప్రవేశపెడతారు. రేపు రెండు సభల్లో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget 2023