వ్యవసాయ రంగంలో సంస్కరణ పేరుతో తీసుకొచ్చిన మూడు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినా, ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్వయంగా క్షమాపణలు చెప్పినా నిరసనల విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటున్నారు రైతులు. సాగు చట్టాలు (Farm laws)ను రద్దు చేస్తున్నట్లు ప్రధాని చేసింది కేవలం ప్రకటనే అని, పార్లమెంటులో ఆ మేరకు ప్రక్రియ జరగడంతోపాటు పంటలకు కనీస మద్దతు ధర చట్టం, కొత్త విద్యుత్ చట్టం ఉపసంహణకు కేంద్రం అంగీకరించేదాకా పట్టువీడబోమని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. ప్రధాని ప్రకటన నేపథ్యంలో 40 రైతు సంఘాల సమాఖ్య సంయుక్త్ కిసాన్ మోర్ఛా ఆదివారం నాడు కీలక సమావేశం నిర్వహించింది. భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడుకున్న రైతు సంఘాల నేతలు.. నిరసనల్ని కొనసాగించాలనే ఫిక్స్ అయ్యారు. ఇంతకు ముందే ప్రకటించినట్లు భారీ కార్యక్రమాలకు సోమవారం నుంచే శ్రీకారం చుట్టనున్నారు..
ఢిల్లీలోని సింఘు సరిహద్దు వద్ద సంయుక్త్ కిసాన్ మోర్చా నేతలు ఆదివారం సమావేశమయ్యారు. రైతు ఆందోళనలో భాగంగా ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలు యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. సోమవారం (నవంబర్ 22న) ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో లక్షల మందితో ‘కిసాన్ మహా పంచాయత్’ కార్యక్రమం ఉంటుందని, దేశం నలుమూలల నుంచి రైతులు ఆ కార్యక్రమంలో పాల్గొంటారని మోర్ఛా నేతలు చెప్పారు. అలాగే,
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమాన్ని ప్రారంభించి నవంబర్ 26కు ఏడాది కావొస్తున్న దరిమిలా ఆరోజు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టనున్నారు. నవంబర్ 26న ఢిల్లీ సరిహద్దుల్లో సభలు, సమావేశాలు నిర్వహించి, గడిచిన ఏడాది కాలంలో అమరులైన రైతులకు నివాళులు అర్పిస్తారు. మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాల సమయంలో ప్రతిరోజూ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామన్న రైతు సంఘాలు..
పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజైన నవంబర్ 29 నుంచీ ‘పార్లమెంట్ మర్చ్’ కొనసాగుతుందని ఎస్కేయూ నేతలు స్పష్టం చేశారు. ప్రధాని ప్రకటన, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రైతు ఉద్యమం భవిష్యత్ కార్యాచరణను చర్చించేందుకు ఈనెల 27న మరో సారి సమావేశం కావాలని రైతు సంఘాల నేతలు నిర్ణయించుకున్నారు. రైతుల పెండింగ్ డిమాండ్ల పై ప్రధానికి బహిరంగ లేఖ రాయాలని తీర్మానించారు. పంటలకు కనీస మద్దతు ధర, మార్కెట్ కమిటీల విధులు, పనులు కాలపరిమితి, విద్యుత్ సవరణ బిల్లు-2020 ఉపసంహరణ, లఖీంపూర్ ఘటనకు బాధ్యుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తొలగింపు తదితర డిమాండ్ల విషయంలో రాజీపడబోమని రైతు సంఘాలు స్పష్టం చేశాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi, Farm Laws, Farmers, Farmers Protest, Lucknow