Farmers Protest: సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి రైతు ఉద్యమం..నిర్మల సంచలన వ్యాఖ్యలు

నిర్మలా సీతారామన్(ఫైల్ ఫొటో)

Nirmala Sitharaman Interview: ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని.. వారికి దూరంగా జరగాలని రైతుకు విజ్ఞప్తి చేశారు. విపక్షాల ఉచ్చులో పడి నష్టపోవద్దని సూచించారు.

 • Share this:
  అన్నదాతల ఆందోళనలతో 17 రోజులుగా ఢిల్లీ శివారు ప్రాంతాలు స్తంభించిపోయాయి. పట్టు వదలని విక్రమార్కుల్లా రైతులు పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని.. ఇంకే ప్రతిపాదనకూ అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు.  రైతులతో కేంద్రం పలు దఫాలుగా చర్చలు జరిపినా.. పరిష్కారం దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. ఈ క్రమంలో దేశ రాజధానిలో రైతుల  చేస్తున్న ఆందోళనలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ న్యూస్18తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని.. వారికి దూరంగా జరగాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. విపక్షాల ఉచ్చులో పడి నష్టపోవద్దని సూచించారు. రాజకీయ ఉనికి కోసమే విపక్షాలు రాద్ధాంతం చేస్తూ.. రైతులను ఎగదోస్తున్నాయని విమర్శలు గుప్పించారు నిర్మల.

  ''రైతుల ఉద్యమం పేరుతో విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి. రాజకీయ లబ్ధి కోసమే రైతులను వాడుకుంటున్నాయి. వారి ఉచ్చులో రైతులు పడవొద్దు. అలాంటి వారికి దూరంగా జరగాలి. ఈ ఆందోళనలను సంఘ విద్రోహక శక్తులు తమ చేతుల్లోకి తీసుకున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనల్లో ఇప్పుడు రైతుల సమస్యల గురించి ఎవరూ మాట్లాడడం లేదు. సంఘ విద్రోహశక్తులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.'' అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

  ''సంప్రదింపులతో సమస్యల పరిష్కారానికి కొంత సమయం పడుతుంది. రైతులతో చర్చలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సంసిద్ధంగానే ఉంది. కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయుష్ గోయెల్ రైతుల ఆందోళనలపై సమీక్షిస్తున్నారు. చట్టాలను వెనక్కి తీసుకోవడం దీర్ఘకాలికంగా రైతులకు మంచిది కాదు. కేంద్రమంత్రులతో కూర్చొని మాట్లాడండి.'' అని రైతు సంఘాల నేతలకు నిర్మల సీతారామన్ సూచించారు.

  రైతు రుణమాఫీ హామీలను ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని నిర్మల సీతారామన్ విమర్శించారు. వారిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని.. కాంగ్రెస్ కపట బుద్ధి మరోసారి నిరూపితమయిందని మండిపడ్డారు..

  ''ఇది రైతుల ప్రభుత్వం. రైతుల కోసం నరేంద్ర మోదీ ఎంతో చేస్తున్నారు. మోదీ నాయత్వంలోనే పంటలకు రికార్డు స్థాయిలో మద్దతు ధర లభిస్తోంది. ఈ మూడు చట్టాల వల్ల కనీస మద్దతు ధరపై ఎలాంటి ప్రభావం ఉండబోదు. కేంద్రం పెద్ద మొత్తంలో ధాన్యం సేకరిస్తోంది. ఎప్పుడూ లేనంతగా రైతుల నుంచి ధాన్యాన్ని కేంద్రమే సేకరిస్తోంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారు.'' ఆమె అన్నారు.  ఇప్పటికే ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అన్నదాతలు.. ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే రేపు జైపూర్- ఢిల్లీ రహదారిపై ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఎల్లుడి సింఘు సరిహద్దులో నిరాహార దీక్షను చేయబోతున్నట్లు ప్రకటించారు. డిసెంబరు 19 లోపు తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ పోరాటం శాంతియుతంగా కొనసాగుతోందని. కొత్త చట్టాలు రద్దు చేసే వరకు ఆందోళన విరమించబోమని తెగేసి చెప్పారు.
  Published by:Shiva Kumar Addula
  First published: