దేశ రాజధానిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ శివార్లలో 21 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారికి పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సినీ ప్రముఖులు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో జవాన్‌కు మద్దతుగా కిసాన్.. అంటూ ఓ వార్త వైరల్‌గా మారింది. రైతుల ఆందోళనకు మద్దతుగా 25వేల మంది జవాన్లు శౌర్య చక్ర అవార్డులను వెనక్కి ఇచ్చారని పలు పత్రికల్లోనూ కథనాలు వచ్చాయి. దీని ఆధారంగా' జై జవాన్.. జై కిసాన్' అంటూ ఎంతో మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఐతే కిసాన్‌కు మద్దతుగా జవాన్లు శౌర్యచక్ర అవార్డును వెనక్కి ఇచ్చారన్న వార్తపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోు (PIB) ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. ఇందులో నిజంలేదని.. ఇది ఫేన్ న్యూస్ అని కొట్టిపారేసింది. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించింది. 1956 నుంచి 2019 వరకు కేవలం 2048 శౌర్య చక్ర అవార్డులనే కేంద్రం అందజేసిందని.. అలాంటప్పుడు ఏకంగా 25వేల మంది శౌర్య చక్ర అవార్డులను ఎలా వెనక్కి ఇవ్వగలరని అభిప్రాయపడింది. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు పీఐబీ ఫ్యాక్ చెక్ సూచించింది.
కాగా, కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిర్ణయాల, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి అంశాలపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వాటిపై PIB ఫ్యాక్ట్ చెక్ ఎప్పటికప్పుడు స్పష్టత ఇస్తోంది.
మరోవైపు రైతుల సంఘాలు, కేంద్రం మధ్య ఇప్పటికే పలు దఫాల చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి పరిష్కారం దొరకడం లేదు. కేంద్రం చెప్పిన ఏ ప్రతిపాదనకూ రైతులు అంగీకరించడం లేదు. మూడు చట్టాలను రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టుతున్నారు. మరోవైపు కేంద్రం కూడా ఆ మూడు చట్టాలను రద్దుచేసే ప్రకస్తే లేదని తేల్చిచెప్పింది. రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికే చట్టాలను తెచ్చామని.. విపక్షాల ఉచ్చులో రైతులు పడవద్దని కోరుతోంది. ఐతే డిసెంబరు 19లోపు చట్టాలను రద్దు చేయాలని.. లేదంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని రైతు సంఘాలు కేంద్రాన్ని హెచ్చరించాయి.
Published by:Shiva Kumar Addula
First published:December 16, 2020, 12:26 IST