Home /News /national /

FARMERS PROTESTS CENTRES MEETING WITH FARMER LEADERS ENDS WITH PROPOSAL TO FORM COMMITTEE ON THE TABLE ROUND 2 ON THURSDAY SK

Farmers protest: రైతులతో కేంద్రం చర్చలు విఫలం.. అసలా చట్టాలే వద్దు

రైతు సంఘాలతో కేంద్రమంత్రుల భేటీ

రైతు సంఘాలతో కేంద్రమంత్రుల భేటీ

Farmers protest: రైతుల సమస్యలకు కమిటీ ఏర్పాటు పరిష్కారం కాదని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదొక్కటే పరిష్కార మార్గమని సూచించారు.

    రైతుల ఆందోళనలతో దేశరాజధాని వేడెక్కింది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. పలు రాష్ట్రాల రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేయడం దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే ఎట్టకేలకు దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. మంగళవారం రైతు సంఘాలతో చర్చలు జరిపింది. ఐతే ఆ చర్చలు విఫలమయ్యాయి. అర్ధాంతరంగా ముగిశాయి. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో 35 రైతు సంఘాలతో ప్రతినిధులతో కేంద్రమంత్రులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో పాటు పీయుష్ గోయల్, సోమ్ ప్రకాశ్ పాల్గొన్నారు. కొత్త చట్టాలపై చర్చించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రులు చెప్పగా.. ఆ ప్రతిపాదనను రైతు సంఘాల ప్రతినిధులు తోసిపుచ్చారు.


    రైతుల సమస్యలకు కమిటీ ఏర్పాటు పరిష్కారం కాదని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదొక్కటే పరిష్కార మార్గమని సూచించారు. ఈ క్రమంలో కొలిక్కిరాకుండానే చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. ఐతే రైతు సంఘాలతో మరోసారి భేటీ కావాలని కేంద్రం నిర్ణయించింది. గురువారం రెండో దఫా చర్చలు జరుపుతామని తెలిపింది. రైతు సంఘాలతో భేటీకి ముందు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నరేంద్రసింగ్ తోమర్, జేపీ నడ్డా భేటీ అయ్యారు. కాగా, రైతు సంఘాలతో భేటీ నేపథ్యంలో విజ్ఞాన భవన్ వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.


    కాగా, ఇటీవల కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ఉత్తరాది రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వేలాది మంది రైతులు సింఘు, టిక్రీ సరిహద్దుల్లో నవంబరు 26 నుంచి ఆందోళనలు చేస్తున్నారు. కార్పొరేట్ వ్యవసాయం తమకు వద్దని.. కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఐతే ఢిల్లీలోకి వెళ్లేందుకు రైతుల ప్రయత్నించడంతో ఇటీవల ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. రైతులపై కేంద్రం బలగాలు లాఠీచార్జ్ చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నను లాఠీలతో కొడతారా? అని కేంద్రంపై విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Farmers, Farmers Protest

    తదుపరి వార్తలు