కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదని రైతు సంఘాలు తేల్చి చెప్పాయి. అంతేకాదు పోలీసులు వేధింపులు ఆపే వరకూ, అక్రమంగా అదుపులోకి తీసుకున్న రైతులను విడుదల చేసే వరకూ.. ప్రభుత్వంతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అప్పటి వరకు ఎలాంటి చర్చలు ఉండవని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. రోడ్లపై ఎక్కడికక్కడ బారీకేడ్లు, ఇనుప చువ్వలు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేస్తున్నారని పోలీసులపై రైతులు మండిపడుతున్నారు. ఇంటర్నెట్ సర్వీసులను కూడా పూర్తిగా నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు ఇంతలా వేధిస్తూ.. మరోవైపు చర్చలకు రమ్మని పిలుస్తారా? అని నిప్పులు చెరుగుతున్నారు. అంతేకాదు పలువురు రైతుల ట్విటర్ ఖాతలను కూడా స్తంభింపజేశారని.. తమ ఉద్యమంపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు.
''చట్టాలను వెనక్కి తీసుకోకుంటే.. మేం కూడా ఇళ్లకు వెళ్లబోం.'' అనే నినాదాన్ని వినిపిస్తున్నారు రైతులు. అక్టోబరు వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇవి ఇప్పట్లో ముగిసేవి కావని తెగేసి చెప్పారు.
Our slogan is - 'kanoon wapsi nahi, to ghar wapsi nahi'. This agitation will not conclude before October, it will not end anytime soon: Bhartiya Kisan Union (Arajnaitik) leader Rakesh Tikait pic.twitter.com/Vnu649AcIr
— ANI (@ANI) February 2, 2021
మరోవైపు రైతుల ఉద్యమానికి విపక్షాల నుంచి క్రమంగా మద్దతు పెరుగుతోంది. మంగళవారం శివసేన ఎంపీలు అరవింద్ సావంత్, సంజయ్ రౌత్ ఘాజీపూర్ సరిహద్దుకు వెళ్లి రైతు సంఘాల నేత రాకేశ్ టికాయత్‌ను కలిసి మద్దతు తెలిపారు. రైతులతో సానుకూల వాతావరణంలో ప్రభుత్వం చర్చలు జరపాలని.. అహంతో వ్యవహరించడం దేశానికి మంచిది కాదని వారు అన్నారు.
Shiv Sena leaders including party MPs Arvind Sawant and Sanjay Raut meet Bharatiya Kisan Union leader Rakesh Tikait at Ghazipur (Delhi-Uttar Pradesh) border. pic.twitter.com/KC4ZZDhJPG
— ANI (@ANI) February 2, 2021
బడ్జెట్లో మద్దతు ధర గురించి ప్రకటన వస్తుందని ఆశించిన రైతులు సంఘాలు.. అలాంటిదేమీ రాకపోవడంతో కేంద్రంపై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 6న దేశవ్యాప్తంగా రాస్తారోకోలు చేపడతామని స్పష్టం చేశారు. ''ఫిబ్రవరి 6న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయబోతున్నాం. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అన్ని హైవేలపై రాస్తారోకో చేపడతాం. మూడు గంటల పాటు శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.'' అని స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ తెలిపారు. సోమవారం సింఘూ సరిహద్దు వద్ద మీడియాతో మాట్లాడిన రైతు సంఘాల నేతలు ఈ ప్రకటన చేశారు.
జనవరి 26న హింసాత్మక ఘటనల తర్వాత రైతులు ఆందోళనలు చేస్తున్న సరిహద్దుల వద్ద పోలీసులు బందోబస్తు పెంచారు. అక్కడి నుంచి రైతులును ఖాళీ చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల వద్ద ఇనుప చువ్వలను ఏర్పాటు చేశారు. రోడ్లపై బారీకేడ్లు, ముళ్ల కంచెలను వేశారు. కాగా, ఢిల్లీ సరిహద్దులో రెండు నెలలకు పైగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. వారితో కేంద్రం 11 దఫాలుగా చర్చలు జరిపింది. కానీ పరిష్కారం మాత్రం దొరకలేదు. మద్దతు ధర కల్పించడంతో పాటు మూడు చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుబట్టుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi, Farmers Protest, New Agriculture Acts