కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఓ వైపు రైతులు ఆందోళనలు.. మరోవైపు సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో.. కొత్త చట్టాల అమలులో కేంద్రానికి ఇబ్బందులు ఎదరవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సామాజిక ఉద్యమకారుడు అన్నాహజరే.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రైతుల సమస్యలపై ఈ నెలాఖరులో నిరాహార దీక్ష చేయబోతున్నట్లు అందులో పేర్కొన్నారు. చట్టాల రూపకల్పనలో ప్రజలను భాగస్వాములను చేయాలని ఆయన అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలు ప్రజాస్వామ్య విలువలకు లోబడి లేవని విమర్శించారు. ఐతే దీక్ష ఏ రోజున చేస్తారన్న దానిపై స్పష్టమైన తేదీ ప్రకటించలేదు అన్నాహజారే.
డిసెంబరు 14న కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు కూడా అన్నా హజారే లేఖరాశారు. ఎంఎస్ స్వామినాథన్ కమిటీ ప్రతిపాదనలను అమలు చేయాలని.. అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ కమిషన్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని ఇవ్వాలని అందులో డిమాండ్ చేశారు. లేదంటే తాను నిరహార దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై ఇప్పటికీ ఐదు సార్లు కేంద్రానికి లేఖ రాశానని.. కానీ ఎలాంటి స్పందన లేదని అన్నా హాజరే పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. తన జీవితంలో చివరి నిరహార దీక్షను రైతుల కోసం చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.
ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిరహార దీక్షకు అనుమతి కోరుతూ సంబంధిత అధికారులకు నాలుగు సార్లు లేఖ రాశానని.. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని ఆయన పేర్కొన్నారు. కాగా, 2011లో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని అన్నాహజారే ముందుండి నడిపించారు. అప్పుడు యావత్ దేశం ఆయనకు మద్దతుగా నిలిచింది. రామ్‌లీలా మైదానంలో నిరహార దీక్ష చరిత్రలో నిలిచిపోయింది. ఆ దీక్షతో నాటి యూఏపీ ప్రభుత్వం దిగొచ్చి,.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసింది. మళ్లీ ఇప్పుడు రైతుల సమస్యలపై అన్నా హజారే దీక్ష చేయనున్న నేపథ్యంలో.. ఏం జరగనుందోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే ఇప్పటికే విధించింది. ఈ అంశంపై పూర్తి తీర్పు వచ్చేవరకు స్టే కొనసాగుతుందని జనవరి 12న స్పష్టం చేసింది. రైతు సమస్యల పరిష్కారం కోసం నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కమిటీలో అశోక్ గులాటీ, హర్‌ప్రీత్ సింగ్ మాస్, ప్రమోద్ కుమార్ జోషి, అనిల్ ధావంత్ సభ్యులుగా ఉన్నారు. రైతు ప్రతినిధులు, ప్రభుత్వంతో కమిటీ చర్చలు జరుపుతోది. మరోవైపు ఇవాళ రైతులతో తొమ్మిదో విడత చర్చలు జరపనుంది కేంద్రం. ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో కేంద్రమంత్రులతో రైతు సంఘాల నేత సమావేశమై కొత్త చట్టాలపై చర్చించనున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:January 15, 2021, 08:07 IST